నెదర్లాండ్స్‌తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో పాకిస్తాన్ టీం చీటింగ్ చేసిందా? బౌండరీ లైన్‌ను పక్కకు జరిపేసి ఏమీ తెలియనట్లు నటించిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ మ్యాచులో 286 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన నెదర్లాండ్స్.. ఒకానొక సమయంలో పటిష్టమైన స్థితిలో నిలిచింది.
ఇలాగైతే టార్గెట్ ఛేజ్ చేసేస్తుందని అంతా అనుకున్నారు. ఇలాంటి టైంలో మైదానంలో ఒక పక్క బౌండరీ లైన్‌ను కొంత వెనక్కు జరిపినట్లు కనిపించింది. ఈ ఘటన నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 21వ ఓవర్లో జరిగింది. బౌండరీ రోప్ ఎక్కడ ఉండాలని మార్క్ చేసిన గీత కూడా ఈ సమయంలో స్పష్టంగా కనిపించింది.

ఈ గీతకు అవతలగా బౌండరీ రోప్ ఉండగా.. పాక్ ఫీల్డర్ ఆ రోప్ వద్దనే నిలబడి ఫీల్డింగ్ చేశాడు. సాధారణంగా అంతర్జాతీయ మ్యాచుల్లో బౌండరీ లైన్ ఎక్కడ ఉండాలని ఒక తెల్లటి గీత గీస్తారు. దానిపై కుషన్లతో ఉన్న బౌండరీ రోప్‌ను ఉంచుతారు. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఇలా బౌండరీని నిర్ణయించే కుషన్లను ఎవరైనా పక్కకు జరిపితే అది పెద్ద తప్పిదం.
ఇది 19.3.2 క్లాజును ఉల్లంఘించినట్లే. 'ఇలా పక్కకు జరిపిన బౌండరీ లైన్‌ను వెంటనే ఒరిజినల్ స్థానానికి మార్చేయాలి. ఒకవేళ మ్యాచ్ జరుగుతుంటే.. డెలివరీ పూర్తయిన వెంటనే బౌండరీ లైన్‌ను యధాస్థానానికి తీసుకొచ్చేయాలి' అని నిబంధనలు చెప్తున్నాయి. కానీ పాకిస్తాన్, నెదర్లాండ్స్ మ్యాచులో దాదాపు అరగంట పాటు ఈ బౌండరీ లైన్ వెనక్కే ఉంది.
అటువైపు కనుక నెదర్లాండ్స్ ఆటగాళ్లు భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఉంటే.. అది చాలా పెద్ద వివాదంగా మారేది. బంతి కనుక నేలపై ఉన్న తెల్ల గీతకు ఆవలగా పడి, బౌండరీ లైన్ ఇవతలే నేలను తాకి ఉంటే.. అంపైర్లు దాన్ని బౌండరీ ఇచ్చేవారు కాదు. అయితే ఎంసీసీ రూల్స్ ప్రకారం ఇలా జరిగితే సిక్సర్ ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో అసలు ఈ బౌండరీ లైన్ ఎందుకు కదిలింది? అని పెద్ద చర్చ జరుగుతోంది.