ప్రస్తుతం టీమిండియా ప్రధాన పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరు ముగ్గురూ కూడా కుడిచేతి వాటం పేసర్లే. దీంతో జట్టులో ఎడం చేతి వాటం పేసర్లు లేని సమస్యను పలువురు మాజీలు ఎత్తి చూపారు. దీనిపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు. వరల్డ్ కప్ టీంలో కూడా బుమ్రా, షమీ, సిరాజ్ ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేని విషయంపై మాట్లాడిన బంగర్.. టీంలోకి వచ్చే ఎడం చేతి వాటం పేసర్ ఎవరైనా సరే సిరాజ్, షమీతో పోటీ పడగలరా? అని ముక్కుసూటిగా ప్రశ్నించాడు. వరల్డ్ కప్ టీంలో సిరాజ్, షమీ, బుమ్రాతోపాటు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే టీంలోకి అర్షదీప్ సింగ్ వంటి ఎడం చేతి వాటం పేసర్‌ను కూడా తీసుకోవాల్సిందని పలువురు అభిప్రాయపడ్డారు.

'గత రెండేళ్లుగా టీం రకరకాల కాంబినేషన్లు ట్రై చేసింది. బాగా ప్రిపేర్ అయింది. కాబట్టి ఆ ప్లాన్లతోనే ముందుకెళ్లాల్సిన సమయం ఇది. ఎడం చేతి వాటం పేసర్ కూడా ఉండాలని అనుకోవడంలో తప్పేం లేదు. అందరం అలాంటి ఆప్షన్ కావాలనే అనుకుంటాం. కానీ అలా వచ్చే పేసర్ ఎవరైనా సరే.. సిరాజ్ లేదా షమీతో పోటీ పడగలరా? అనేది ప్రశ్న. ఎందుకంటే ఈ ఇద్దరి దగ్గరా చాలా క్వాలిటీ ఉంది' అని బంగర్ వివరించాడు.
ఈ సందర్భంగా క్లాసికల్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బంగర్ గుర్తుచేశాడు. '2003లో లక్ష్మణ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ టీం కాంబినేషన్‌లో సెట్ అవలేదు. దీంతో ఆ వరల్డ్ కప్ ఆడలేకపోయాడు' అని చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ అనేది నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందని, ఈ టోర్నీకి సమయం దగ్గర పడినప్పుడు ఆటగాళ్లు రాణించాలని బంగర్ అన్నాడు. అప్పుడే వారికి జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుందని వివరించాడు.