మరికొన్ని గంటల్లో వరల్డ్ కప్ మొదలవుతుంది. అన్ని జట్లు ఈ మెగా టోర్నీలో తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని పసికూన దేశాలు కూడా వరల్డ్ కప్‌లో బడా జట్లకు షాకివ్వాలని అనుకుంటున్నాయి. అది జరగాలంటే ఆయా జట్లలోని బడా ప్లేయర్లను వెంటనే అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇలా టీమిండియాలో ఉన్న స్టార్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు.
ఈ వరల్డ్ కప్‌లో ఎలాగైనా సత్తా చాటాలని పసికూన దేశం నెదర్లాండ్స్ అనుకుంటోంది. దీనికోసం బెంగళూరులో ట్రైనింగ్ క్యాంప్‌లో ఆ టీం ప్లేయర్లు చెమటోడుస్తున్నారు. మెగా టోర్నీలో బలమైన తొమ్మిది టీమ్స్‌ను నెదర్లాండ్స్ ఎదుర్కోవాల్సి ఉంది. వీటిలో బలమైన టీమిండియా ఒకటి. తమ ఎ-గేమ్ ఆడినా కూడా నెదర్లాండ్స్ టీం.. భారత్‌ను ఓడించడం కష్టమనే చెప్పాలి.

ఈ క్రమంలోనే ఆ టీం కీలక ఆల్‌రౌండర్ లోగన్ వాన్ బేక్ మాట్లాడుతూ.. భారత్‌తో జరిగే మ్యాచులో విరాట్ కోహ్లీ వికెట్ ఎలా తీసుకోవాలని ఇప్పటికే తాము ప్లాన్లు వేసేసుకున్నామని చెప్పాడు. నవంబరు 12న బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్, భారత్ టీమ్స్ తలపడనున్నాయి. తను కేవలం ఐదు బంతుల్లో కోహ్లీని అవుట్ చేస్తానని వాన్ బేక్ ధీమా వ్యక్తం చేశాడు.
'కోహ్లీకి నేను బౌలింగ్ చేస్తే మొదటి రెండు బంతులు అవుట్ స్వింగర్లు వేస్తా. ఆ తర్వాత ఒక స్లో బాల్, ఆఫ్‌కట్టర్ స్లోబాల్ వేస్తా. తను ఒక ఫోర్ కొడతాడు. దీంతో చికాకు పడినట్లు నటిస్తా. ఒక ఐదు నిమిషాలు ఆట జరగకుండా ఆపేస్తా. కెప్టెన్‌ను పిలిచి ఏదో మాట్లాడుతున్నట్లు యాక్ట్ చేస్తా. ఏదో ఒక వైపు చెయ్యి చూపించి అటువైపు బౌలింగ్ చేస్తున్నట్లు నాటకం ఆడతా. కానీ అటు బౌలింగ్ చేయకుండా కోహ్లీని మోసం చేస్తా అన్నమాట' అని వాన్ బేక్ చెప్పాడు.
ఇలా నాలుగు బంతులు వేసిన తర్వాత క్రికెట్ దేవుళ్లను తలచుకొని కోహ్లీ వికెట్ ప్రసాదించాలని కోరుకుంటానని అన్నాడు. 'నాలుగో బంతికి మంచి హాఫ్ వాలీ వేస్తా.. కోహ్లీ దాన్ని ఫోర్ బాదేస్తాడు. ప్రేక్షకులు అరుస్తూ ఉత్సాహంతో ఎగిరి గంతులు వేస్తారు. కోహ్లీ కూడా ధీమాగా తనే క్రికెట్‌లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అని అనుకుంటాడు. అది నిజమే అనుకోండి. ఇక్కడే నా ప్లాన్ అమలు చేస్తా' అని బేక్ చెప్పుకొచ్చాడు.
'నాలుగు బంతులు వేసిన తర్వాత కోహ్లీ ఎలాంటి మైండ్ సెట్‌లో ఉండాలని నేను అనుకుంటున్నానో అక్కడకు తనను తీసుకొస్తా అన్నమాట. ఇప్పుడు కోహ్లీ కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. నాకు ఐదు బంతులు చాలు. మళ్లీ నా మార్క్ దగ్గరకు వెళ్లగానే పైకి చూసి.. ఈ క్షణం నన్ను ఏం అడిగినా చేస్తా జస్ట్ కోహ్లీ వికెట్ ప్రసాదించు స్వామీ అని క్రికెట్ దేవుళ్లను కోరుకుంటా. ఆ బంతికి కళ్లు మూసుకొని వచ్చి వేస్తా కోహ్లీ అవుటైపోతాడు' అని తన ప్లాన్ పూర్తి చేశాడీ డచ్ ఆల్‌రౌండర్.