వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ను బీసీసీఐ ఎప్పటికప్పుడు నిరాశ పరుస్తూనే ఉంది. ఈ మెగా టోర్నీ టికెట్లను బుక్‌మైషోలో అమ్ముతున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ విషయంలో బుక్‌మైషో, బీసీసీఐ రెండూ దారుణంగా విఫలమయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం ఇలా టికెట్లు విడుదల చేసినప్పుడే ఫ్యాన్స్ మండిపడ్డారు. ఏకంగా 16 గంటలపాటు వెయిట్ చేయాలని యాప్‌లో చూపించింది.
కానీ కొన్ని నిమిషాల్లోనే టికెట్లన్నీ అయిపోయాయి. దీంతో కోట్లాది మంది అభిమానులు చికాకుపడ్డారు. బీసీసీఐ మోసం చేస్తోందని, టికెట్లు బ్లాక్‌లో అమ్ముకుంటోందని సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో వేరే వెబ్‌సైట్లలో ఈ టికెట్లను రూ.లక్షల రూపాయలకు కొందరు అమ్మకానికి పెట్టడం కూడా ఈ విమర్శలకు ఆజ్యం పోసింది. ఇవన్నీ చూసిన బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

శుక్రవారం రాత్రి ఓవరాల్‌గా నాలుగు లక్షల టికెట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. ఇది విన్న ఫ్యాన్స్ తెగ సంతోషించారు. ఎలాగైనా తమకు టికెట్లు దొరుకుతాయని భావించారు. కానీ కథ మళ్లీ మొదటికే వచ్చింది. టికెట్లు ఖాళీగా కనిపించినా.. వాటిని సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా చాలామంది యూజర్లకు దక్కలేదు. కళ్ల ముందు చూస్తుండగానే టికెట్లన్నీ మాయమైపోయాయి.
ఇలా తమకు ఎదురైన అనుభవాలను కొందరు వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇవి చూసిన చాలా మంది ఇది వరల్డ్ కప్ కాదని, 'స్కామ్ 2023' అంటూ బీసీసీఐ సెక్రటరీ జే షా ఫొటోలతో ట్రోల్ చేస్తున్నారు. ఈ నాలుగు లక్షల టికెట్లు కూడా అమ్మకానికి పెట్టిన గంటలోనే ఖాళీ అయిపోయాయి. కానీ ఎంతోమందికి కనీసం సీట్లు సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా దక్కలేదు.
గంటలకొద్దీ టికెట్లు బుక్ చేసుకోవడానికి వెయిట్ చేసినా కూడా.. ఈ బుక్‌మైషో యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఏదో సమస్య వల్ల టికట్లు బుక్ చేసుకోవడం కుదర్లేదు. మరికొందరైతే ఈ యాప్ సాఫ్ట్‌వేర్ కోడ్‌ను కూడా చెక్ చేసేశారు. దీనిలో ఉన్న తప్పులను చూపిస్తూ.. బీసీసీఐ, బుక్‌మైషో రెండూ కలిసి సామాన్యులను మోసం చేస్తున్నాయని, కొద్ది టికెట్లను మాత్రమే విడుదల చేసి, చాలా టికెట్లు బ్లాక్ చేస్తున్నాయని ఆరోపణలు చేశారు.