ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మళ్లీ వన్డే వరల్డ్ కప్ మొదలైంది. గత వరల్డ్ కప్ ఫైనలిస్టులైన ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ జట్లే.. ఈసారి వరల్డ్ కప్ మొదలు పెడుతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్ కు టెన్షన్ మొదలైంది.
స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వెన్ను గాయంతో మొదటి మ్యాచ్ ఆడడేమో అని వార్తలు వినిపించాయి. అలాగే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఈ మ్యాచ్ ఆడడంటూ వార్తలు వచ్చాయి. ఈ మ్యాచ్ టాస్ సమయంలో అది నిజమేనని తేలింది. టాస్ కోసం కేన్ విలియమ్సన్ రాలేదు. అతని స్థానంలో వెటరన్ ప్లేయర్ టామ్ లాథమ్ వచ్చాడు.

ఈ మ్యాచులో టాస్ గెలిచిన టామ్ లాథమ్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే కేన్ మామ ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదని, అందుకే ఈ మ్యాచ్ ఆడటం లేదని చెప్పుకొచ్చాడు. అలాగే గాయంతో స్టార్ పేసర్ లోకీ ఫెర్గూసన్ కూడా ఈ మ్యాచ్ మిస్ అవుతున్నట్లు ప్రకటించాడు.
తాను టాస్ గెలిచి ఉంటే తను కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకునే వాడినని జోస్ బట్లర్ చెప్పాడు. తమ టీంలో బెన్ స్టోక్స్ నడుం నొప్పితో బాధ పడుతున్నాడని, అతను ఈ మ్యాచ్ ఆడటం లేదని వెల్లడించాడు. అలాగే రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, అట్కిన్సన్ కూడా ఆడటం లేదని చెప్పాడు.
న్యూజిల్యాండ్ టీం: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారియల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్ మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్
ఇంగ్లండ్ టీం: జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, మొయీన్ అలీ, శామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, మార్క్ వుడ్