ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. మొత్తం పది వేదికల్లో ఈ టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ డిసైడ్ అయింది. వీటీలో ఒక్క హైదరాబాద్ తప్ప మిగతా అన్ని స్టేడియాల్లో నాలుగైదు మ్యాచులు జరుగుతున్నాయి. ముంబై, కోల్‌కతాలో సెమీఫైనల్స్ నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ టోర్నీ మొదలవుతుంది. గత వరల్డ్ కప్ ఫైనలిస్టులు న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో తలపడతాయి.
ఈ సారి వరల్డ్ కప్ మ్యాచులు హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, ముంబై, కోల్‌కతా వేదికలుగా జరుగుతాయి. అయితే చివరగా వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది 2011లో. ఆ టోర్నీలో వరల్డ్ కప్ మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చిన రెండు స్టేడియాలకు ఈసారి ఆ అవకాశం దక్కలేదు. ఆ రెండు స్టేడియాలే మొహాలీ, నాగ్‌పూర్. ఈ రెండింటినీ బీసీసీఐ ఎందుకు ఇగ్నోర్ చేసిందో తెలియరాలేదు.

అయితే ఈ టోర్నీలో భారత జట్టు అక్టోబర్ 8న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. ఈ రెండు జట్లు 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో తలపడినప్పుడు ఆసీస్ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆ టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. అలాగే అక్టోబర్ 15న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పుట్టిన రోజు. అదే రోజున భారత్, పాకిస్తాన్ జట్లు తలపడతాయి.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుంది. వరల్డ్ కప్ ఫైనల్‌కు కూడా ఇదే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అద్భుతమైన సదుపాయాలతోపాటు లక్షమంది సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియం.. ప్రపంచంలోని బెస్ట్ స్టేడియాల్లో ఒకటి. అందుకే దీనిలో కీలకమైన మ్యాచులు నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఏదేమైనా బ్యాటింగ్‌కు సహకరించే ఈ పిచ్‌పై జరిగే మ్యాచ్‌లు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించడం ఖాయం.