వరల్డ్ కప్‌లో ఎట్టకేలకు 'నాగిని డ్యాన్స్' టైం వచ్చేసింది. సెమీస్ సమీకరణాలపై ఏమాత్రం ప్రభావం చూపకపోయినా.. ఫ్యాన్స్‌కు మజా పంచే మ్యాచ్‌కు ఢిల్లీ వేదిక కానుంది. ఇక్కడి అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు టీమ్స్ కూడా సెమీస్ రేసు నుంచి తప్పుకున్నట్లే. అయినా సరే ఈ రెండు జట్ల అభిమానులు మాత్రం ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్.. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. రెండో ఇన్నింగ్సులో బౌలింగ్ చేయడం కష్టంగా ఉండే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని షకీబ్ తెలిపాడు. ఇప్పటికైనా బంగ్లా జట్టు పోరాడుతుందని అనుకుంటున్నట్లు చెప్పాడు. తమ జట్టులో ముస్తాఫిజుర్ స్థానంలో తంజీమ్ హసన్‌ను తీసుకున్నట్లు తెలియజేశాడు.

ప్రస్తుతం ముస్తాఫిజుర్ అంత ఫిట్‌గా లేడని, అందుకే అతన్ని తీసుకున్నామని చెప్పాడు. అదే సమయంలో శ్రీలంక జట్టులో రెండు మార్పులు చేసినట్లు ఆ టీం కెప్టెన్ కుశాల్ మెండిస్ తెలిపాడు. ధనంజయ డి సిల్వ, కుశాల్ పెరీరా ఆడుతున్నారని చెప్పాడు. వీళ్లిద్దరి కోసం దిముత్ కరుణరత్నే, హేమంతను పక్కన పెట్టినట్లు వెల్లడించాడు.
వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా చేసిన రెండు సెంచరీలు ఇదే పిచ్‌పై వచ్చినట్లు నిపుణులు చెప్తున్నారు. ఈ పిచ్‌పై పేస్, బౌన్స్ కూడా చక్కగా లభిస్తుందని తెలుస్తోంది. కానీ బ్యాటర్లు కనుక క్రీజులో కుదురుకుంటే చెలరేగడం ఖాయమట.
శ్రీలంక: పాథుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ ఆసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వ, మహీష్ తీక్షణ, కాసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షాన్ మధుశంక
బంగ్లాదేశ్: లిటాన్ దాస్, తంజీద్ హసన్, నజ్ముల్ హసన్ షాంటో, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మెహదీ హసన్ మిరాజ్, తౌహీద్ హృదోయ్, టస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్, షోరిఫుల్ ఇస్లామ్