వరల్డ్ కప్‌లో షాకింగ్ సీన్స్ కనిపించాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు కనీసం షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకోలేదు. ఎవరి దారిన వాళ్లు మైదానం వీడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచులో పలుసార్లు హైడ్రామా జరిగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బౌలింగ్ తీసుకుంది. బంతితో వారికి మంచి ఆరంభమే దక్కింది. సాఫీగా సాగుతున్న మ్యాచులో బంగ్లా కెప్టెన్ షకీబల్ చేసిన ఒక పని అలజడికి తెరలేపింది. సదీర సమరవిక్రమ అవుటైన తర్వాత శ్రీలంక వెటరన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ మైదానంలోకి వచ్చాడు.

అతను బ్యాటింగ్‌కు క్రీజులోకి వచ్చినప్పుడు బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ బౌలింగ్ చేస్తున్నాడు. మాథ్యూస్ తన మొదటి బంతి ఎదుర్కోవడానికి ముందే అతని హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది. దీంతో మరో హెల్మెట్ కోసం మాథ్యూస్ తన టీంను పిలిచాడు. సరిగ్గా అదే సమయంలో బంగ్లా కెప్టెన్ తన తెలివితేటలు చూపించాడు. రూల్స్‌ను తనకు అనుకూలంగా వాడుకొని మాథ్యూస్ అవుట్ కోసం అప్పీల్ చేశాడు.
క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక వికెట్ పడినప్పుడు.. తదుపరి బ్యాటర్ క్రీజులోకి వచ్చి తొలి బంతిని ఎదుర్కోవడానికి 2 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఒకవేళ బ్యాటర్ కనుక ఈ రెండు నిమిషాల్లో రెడీ అవ్వకపోతే అతన్ని టైమ్డ్ అవుట్‌గా అంపైర్లు ప్రకటిస్తారు. ఈ రూల్‌ను వాడుకున్న షకీబ్.. మాథ్యూస్ సరైన టైంకి క్రీజులో సిద్ధంగా లేడన్నాడు. అంపైర్లు కూడా నిజమేనని మాథ్యూస్‌ను అవుట్‌గా తేల్చారు.
ఆ తర్వాత బంగ్లా ఛేజింగ్‌లో షకీబ్‌ను అవుట్ చేసిన మాథ్యూస్.. వాచ్ చూపిస్తున్నట్లుగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ షకీబ్ (82), నజ్ముల్ షాంటో (90) రాణించడంతో చివరకు ఈ మ్యాచులో బంగ్లానే గెలిచింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. కానీ ఈ మ్యాచులో మాత్రం లంక, బంగ్లా ప్లేయర్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.