తను టైమ్ అవుట్‌గా పెవిలియన్ చేరడంపై శ్రీలంక వెటరన్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ స్పందించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడిన అతను.. బంగ్లాదేశ్‌పై మండిపడ్డాడు. ఇలా చేయడానికి బంగ్లాకు సిగ్గుండాలన్నాడు. ఈ మ్యాచులో సమర విక్రమ అవుటైన తర్వాత ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే బ్యాటింగ్ మొదలు పెట్టడానికి ముందే హెల్మెట్ స్ట్రాప్ తెగిపోయింది. ఇది గమనించిన మాథ్యూస్.. మరో హెల్మెట్ తెప్పించుకోబోయాడు. సరిగ్గా అదే సమయంలో బంగ్లా కెప్టెన్ తన తెలివితేటలు చూపించాడు. రూల్స్‌ను తనకు అనుకూలంగా వాడుకొని మాథ్యూస్ అవుట్ కోసం అప్పీల్ చేశాడు.

క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక వికెట్ పడినప్పుడు.. తదుపరి బ్యాటర్ క్రీజులోకి వచ్చి తొలి బంతిని ఎదుర్కోవడానికి 2 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ఒకవేళ బ్యాటర్ కనుక ఈ రెండు నిమిషాల్లో రెడీ అవ్వకపోతే అతన్ని టైమ్డ్ అవుట్‌గా అంపైర్లు ప్రకటిస్తారు. ఈ రూల్‌ను వాడుకున్న షకీబ్.. మాథ్యూస్ సరైన టైంకి క్రీజులో సిద్ధంగా లేడన్నాడు. అంపైర్లు కూడా నిజమేనని మాథ్యూస్‌ను అవుట్‌గా తేల్చారు.
మ్యాచ్ అనంతరం దీనిపై మాట్లాడిన మాథ్యూస్.. 'నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇది షకీబ్, బంగ్లాదేశ్ టీం చేసిన సిగ్గుమాలిన పని. ఆ టైంలో వాళ్ల దగ్గర కనీసం కామన్ సెన్స్ లేనట్లు ప్రవర్తించారు. నా 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ప్రత్యర్థి జట్టు ఇంత దిగజారడం ఇదే మొదటి సారి చూస్తున్నా' అని చెప్పాడు. అలాగే అతని అవుట్‌పై ఫోర్త్ అంపైర్ ఇచ్చిన వివరణను కూడా తప్పుబట్టాడు.
దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్‌ను ఐసీసీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దీనిపై స్పందించిన మాథ్యూస్.. 'ఫోర్గ్ అంపైర్‌దే ఇక్కడ తప్పు. వీడియో సాక్ష్యాలు పరిశీలిస్తే నేను హెల్మెట్ ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఐదు సెకన్ల టైం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ఫోర్తో అంపైర్ వివరణ ఇస్తారా? ఎంతైనా సేఫ్టీ ముఖ్యం కదా. హెల్మెట్ లేకుండా అవతలి బౌలర్‌ను ఎదుర్కోవడం కుదరదు కదా' అని పేర్కొన్నాడు.