పాకిస్తాన్ భారీ కష్టాల్లో కూరుకుపోయింది. వరల్డ్ కప్‌లో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో దిగజారిపోయింది. దీంతో ఇప్పుడు ఏకంగా పీసీబీ రంగంలోకి దిగి వరల్డ్ కప్ జట్టు ప్రదర్శనను బట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించింది. ఇప్పటికే బాబర్ కెప్టెన్సీ చెత్తగా ఉందని, బ్యాటర్‌గానూ అతడు దారుణంగా ఫెయిల్ అవుతున్నాడని విమర్శలొస్తుండడంతో అతడి కెప్టెన్సీ పోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అలాగే వరల్డ్ కప్ టోర్నీ తర్వాత బాబర్‌ను కెప్టెన్‌గా తొలగించడానికి ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.
బలహీలంగా టీం:పాకిస్తాన్ జట్టులో ఉన్న ఆటగాళ్లంతా అద్భుతమైన ప్రతిభావంతులైన ఆటగాళ్లే. కానీ అదంతా పేపర్‌పైనే. ఒక్కసారి మైదానంలో దిగారంటే పేలవ ప్రదర్శనతో పరువు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా బాబర్ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు మరింత పేలవంగా మారింది. జట్టులో ఆత్మవిశ్వాసం నింపడంలో బాబర్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడనేది మాజీల మాట.

ఆసియా కప్‌లో కూడా బాబర్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన పాకిస్తాన్ చెత్త ఆటతో ఫెయిలైంది. ముఖ్యంగా భారత్‌పై 228 పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్ పరువు కూడా పోగొట్టుకుంది. ఆ తర్వాత శ్రీలంకపై కూడా 2 వికెట్ల తేడాతో ఓడి ఆసియా కప్ నుంచే వైదొలిగింది.
ఇక వరల్డ్ కప్‌లో కూడా నెదర్లాండ్స్, శ్రీలంకపై అద్భుత విజయాలు సాధించిన పాకిస్తాన్ ఆ తర్వాత ఫామ్ పూర్తిగా కోల్పోయి వరుస ఓటములు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో జట్టుతో పాటు బాబర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
కెప్టెన్‌గా ఫెయిల్:బాబర్ కెప్టెన్‌గా కూడా పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడంటున్నారు విశ్లేషకులు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్, వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీల్లో జట్టుపై చాలా ఒత్తిడి ఉంటుంది. కెప్టెన్‌గా జట్టుపై ఆ ఒత్తిడి లేకుండా చూడాల్సిన బాధ్యత కెప్టెన్‌దే. కానీ బాబర్ అందులో పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు.

మెరుగైనా కెప్టెన్‌గా రాణించాలంటే క్లిష్టపరిస్థితుల్లో సైతం కొత్తగా ఆలోచించాలి, బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెట్టింగ్, బ్యాటింగ్ పొజిషన్ సెట్టింగ్స్.. ఇలా అన్ని విభాగాల్లో తనదైన మార్క్ చూపించాలి. కానీ బాబర్ ఇందులో ఒక్కదానిలో కూడా రాణించలేకపోతున్నాడు.
ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో బాబర్ చేసిన బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెట్టింగ్ కూడా పాక్ జట్టు ఓటమికి ఓ కారణమే. ఆ మ్యాచ్‌లో హష్మతుల్లా కెప్టెన్సీ బాబర్ కెప్టెన్సీ కంటే మెరుగ్గా కనిపించిందనేది నిపుణుల మాట.
బ్యాటింగ్‌లో కూడా:బాబర్ వరల్డ్ నెంబర్ వన్ వన్డే బ్యాటర్. బ్యాటర్‌గా ఎన్నో రికార్డులు సాధించాడు. కానీ కెప్టెన్‌గా మారిన తర్వాత అతడి బ్యాటింగ్‌లో పదును తగ్గిందనేది విశ్లేషకుల మాట. దీనికి తాజాగా జరిగిన టోర్నీల్లో అతడి ప్రదర్శననే ప్రూఫ్‌గా చూపిస్తున్నారు.
2022 టీ20 ఆసియా కప్‌లో కూడా బాబర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మొత్తం టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడి కేవలం 68 రన్స్ మాత్రమే చేశాడు. అదే ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో కూడా 7 మ్యాచ్‌లు ఆడి 17.71 సగటుతో కేవలం 124 రన్స్ మాత్రమే చేశాడు. ఇక ప్రస్తుత వరల్డ్ కప్‌లో కూడా 5 మ్యాచ్‌లలో కేవలం 157 రన్స్ మాత్రమే చేయగలిగాడు.
దీన్ని బట్టి చూస్తే తాజాగా పీసీబీ చేసిన ప్రకటన బాబర్ కెప్టెన్సీ గురించే అనిపిస్తోంది. ఒకవేళ తదుపరి మ్యాచ్‌ల్లో అయినా బాబర్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించి పాకిస్తాన్ జట్టును విజయాల వైపు నడిపిస్తే తప్ప బాబర్ కెప్టెన్సీ నిలబడేలా లేదు.