బలమైన జట్టుతో సెమీస్ వరకు దూసుకొచ్చిన సౌతాఫ్రికా.. సరిగ్గా సెమీస్ మ్యాచులో తడబడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా దారుణంగా ఫెయిలైంది. ఒక్క డేవిడ్ మిల్లర్ (101) మాత్రమే రాణించాడు. మిగతా బ్యాటర్లు అందరూ దారుణంగా విఫలమయ్యారు.
అయితే మిల్లర్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా మిగతా వాళ్ల నుంచి అతనికి సహకారం తగ్గింది. దీంతో సౌతాఫ్రికా కేవలం 212 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ చాలా ఈజీగా ఛేజ్ చేసేస్తుందని అంతా అనుకున్నారు. కానీ టఫ్ పిచ్‌పై నిలబడిన గేమ్ మారుస్తూ విజయానికి సౌతాఫ్రికా చేరువగా వచ్చింది.

కానీ తమకు వచ్చిన అవకాశాలను క్యాష్ చేసుకోలేకపోయిన సఫారీలు చివరకు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆసీస్ బ్యాటర్లు ఇచ్చిన చాలా క్యాచులను సఫారీ ప్లేయర్లు నేలపాలు చేశారు. దానికితోడు టెంబా బవుమా కెప్టెన్సీలో కూడా పలు లోపాలు కనిపించాయి. ఇవన్నీ చూసిన అభిమానులు.. ఆ టీంపై మండిపడుతున్నారు.
సౌతాఫ్రికా ఓటమికి టెంబా బవుమా, సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డీ కాక్ మాత్రమే కారణం అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. పిచ్‌పై ఏమాత్రం టర్న్ లభిస్తుందని అనుకున్నా సరే ఏ కెప్టెన్ అయినా ముందుగా తన స్పిన్నర్లను బరిలో దింపుతాడు. కానీ కెప్టెన్ బవుమా మాత్రం పేసర్లను కొనసాగించగా.. వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేదు.

ఇక వెటరన్ కీపర్ అయిన క్వింటన్ డీ కాక్ ఈ మ్యాచులో చాలా పేలవంగా కీపింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన అతను.. కీలక బ్యాటర్లు ఇచ్చిన పలు క్యాచులు నేలపాలు చేశాడు. చివర్లో క్రీజులో పాతుకుపోయి జట్టును విజయతీరాలకు చేర్చబోయిన ప్యాట్ కమిన్స్ క్యాచ్ కూడా జారవిడిచాడు.
ఆ టైంలో సఫారీ మిడిలార్డర్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతోంది. సఫారీ ఓటమికి ముఖ్యంగా డీ కాక్, బవుమానే కారణం అంటూ పోస్టులు పెడుతున్నారు.