ఆస్ట్రేలియా టీం వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద విజయం నమోదు చేసింది. పసికూన నెదర్లాండ్స్‌ను ఏకంగా 309 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచులో ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్‌కు అనుకున్న ఆరంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్ (9) విఫలమయ్యాడు. అయితే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (104) వరుసగా రెండో సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఇక అతనికి జత కలిసిన స్టీవ్ స్మిత్ (71), మార్నస్ లబుషేన్ (62) కూడా వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇక చివర్లో బరిలో దిగిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (106) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి, వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా ఏకంగా 399 పరుగులు చేసింది.

నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్ నాలుగు వికెట్లు తీసుకున్నా కూడా ఆసీస్ జోరుకు కళ్లెం వేయలేకపోయాడు. భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ తేలిపోయింది. ఆ టీం ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (25) మినహా మరెవరూ కనీసం 15 పరుగుల మార్కు దాటలేదంటేనే వాళ్లు ఎలా ఆడారో అర్థం చేసుకోవచ్చు.
ఆసీస్ బౌలర్లలో బంతి అందుకున్న ప్రతి ఒక్కరూ వికెట్ తీసుకున్నారు. ఇక ఆడమ్ జంపా అయితే కేవలం 3 ఓవర్లు మాత్రమే వేసి 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఓటమిపై నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ కూడా స్పందించాడు.
ఆస్ట్రేలియా జట్టులో వరల్డ్ క్లాస్ బౌలర్లున్నారని, వాళ్లని ఎదుర్కోవడంలో తమ బ్యాటర్లు ఇంకొంత బాగా ఆడి ఉండాల్సిందని అన్నాడు. ఇక మ్యాక్స్‌వెల్ విధ్వంసం గురించి స్పందిస్తూ.. 'బౌలింగ్ వేసేటప్పుడు ఏ మాత్రం అటు ఇటైనా కచ్చితంగా బౌండరీలు బాదించుకోవాల్సిందే. మా బౌలర్లు చేసిన తప్పు అదే. ఇక బౌలర్ల చిన్న చిన్న తప్పులను గుర్తించి దానికి తగ్గట్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ బ్యాటర్లను మెచ్చుకుని తీరాలి' అన్నాడు.
'దాదాపు 10 ఓవర్లున్నా మ్యాక్స్‌వెల్‌ను మేం అవుట్ చేయలేకపోయాం. ఢిల్లీ పిచ్ అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకూ ఇద్దరికీ సహకరిస్తుంది. అందుకే మా బౌలర్లు చేసిన తప్పులను ఆసీస్ బ్యాటర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు' అన్నాడు.
ఇక తమ బ్యాటింగ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ.. 'మా ఓపెనర్లు 18 నెలలుగా బాగా ఆడుతున్నారు. మేం ఇక్కడ ఉన్నామంటే వాళ్లే కారణం. అందుకే ఈ మ్యాచ్‌లో వాళ్లు ఫెయిల్ అయినా వాళ్లకి మా మద్దతు ఉంటుంది. అయితే మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో అయినా బ్యాటర్లు బాగా రాణించాలని కోరుకుంటున్నా. ఈ మ్యాచ్‌లో చేసిన తప్పులను ఓ సారి గమనించుకుని బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కోసం వేగంగా సిద్ధమవ్వాలనుకుంటున్నాం' అంటూ స్కాట్ ముగించాడు.