David Warner: నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగాడు. ఈ వరల్డ్ కప్‌లో వరుసగా రెండో సెంచరీ బాదిన అతను.. వరల్డ్ కప్‌లలో అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్‌గా రోహిత్ రికార్డును సమం చేశాడు. అతను ఎక్కడా తగ్గకుండా వేగంగా సెంచరీ బాదడం వల్లనే ఆసీస్ అంత పెద్ద స్కోరు చేయగలిగిందని అనడం అతిశయోక్తి కాదు.
అలాగని గ్లెన్ మ్యాక్స్‌వెల్ సృష్టించిన విధ్వంసాన్ని కూడా తక్కువ చేయలేం. అయితే మైదానంలో ఫీల్డింగ్ సమయంలో కూడా వార్నర్ తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. నెదర్లాండ్స్ బ్యాటర్ సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెట్ బ్యాటింగ్ చేస్తుండగా బౌండరీ లైన్ వద్ద అతను అందుకున్న క్యాచ్ చూసి అందరూ ఔరా అంటూ ఆశ్చర్యపోయారు.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్.. వార్నర్‌కు స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్‌లో వార్నర్ ఆడేది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకే. అంటే అతనికి ఈ స్టేడియం గురించి బాగా తెలుసన్నమాట. అందుకే అతను అంత ఈజీగా సెంచరీ బాదేశాడని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఆ తర్వాత ఫీల్డింగ్‌లో కూడా అదిరిపోయే క్యాచ్ పట్టాడు.
నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఎంగెల్‌బ్రెట్ బ్యాటింగ్ చస్తున్నాడు. మిచెల్ మార్ష్ వేసిన ఆ ఓవర్ల భారీ సిక్సర్ బాదేందుకు ఎంగెల్‌బ్రెట్ ప్రయత్నించాడు. అతను కొట్టిన షాట్ చూస్తే.. బంతి ఈజీగా స్క్వేర్ లెగ్ బౌండరీ లైన్ దాటేలా కనిపించింది. కానీ అటువైపే ఫీల్డింగ్ చేస్తున్న వార్నర్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగిరి మరీ దాన్ని పట్టేశాడు.
పర్‌ఫెక్ట్ టైంలో గాల్లోకి ఎగిరిన అతను.. బంతి పట్టుకొని కిందకు దిగాడు. ఆ తర్వాత బౌండరీ లైన్ దాటకుండా చక్కగా తనను తాను బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్ అయితే.. 'వార్నర్ మామా.. నువ్వు మా టీంలో ఉండుంటే కచ్చితంగా నీకే మెడల్ వచ్చేది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మాజీలు కూడా ఈ క్యాచ్ చూసి నోరెళ్లబెట్టారంటేనే.. ఇది ఎంత అద్భుతమైన క్యాచ్ అని అర్థం చేసుకోవచ్చు.