AUSvsNED: నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియాకు అదృష్టం కూడా బాగా కలిసొచ్చింది. వార్నర్ రనౌట్ మిస్ అవడం నుంచి క్యాచులు నేలపాలు కావడం వరకూ అన్నీ ఈ మ్యాచులో ఆసీస్‌కు ఫేవర్‌గా జరిగాయి. మ్యాచ్ చివర్లో స్టంపింగ్ కూడా లక్కీగా ఆసీస్‌కు అనుకూలంగా జరగడం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. డేవిడ్ వార్నర్ (104), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (106) ధాటిగా ఆడటంతోపాటు స్టీవ్ స్మిత్ (71), మార్నస్ లబుషేన్ (61) వేగంగా ఆడటంతో 399 పరుగుల భారీ స్కోరు చేసింది. వార్నర్ వ్యక్తిగత స్కోరు 32 పరుగుల వద్ద చాలా ఈజీగా రనౌట్ అవ్వాల్సింది. కానీ నెదర్లాండ్స్ ఫీల్డర్ తడబాటుతో అతను బతికిపోయాడు.

నెదర్లాండ్స్ ఫీల్డర్లు కొన్ని క్యాచులు కూడా నేలపాలు చేశారు. ఇదంతా ఒక ఎత్తయితే నెదర్లాండ్స్ టీం కోల్పోయిన చివరి వికెట్ మరో ఎత్తు. ఎందుకంటే ఆ టైంలో తన మూడో ఓవర్ వేస్తున్న ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా.. అప్పటికే రెండు వికెట్లు తీసుకొని సత్తా చాటాడు. 21వ ఓవర్లో బంతి అందుకున్న అతను ఆర్యన్ దత్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.
దీంతో క్రీజులోకి వచ్చిన పాల్ వాన్ మీకరన్ వింతగా అవుటయ్యాడు. లెగ్ సైడ్ జంపా వేసిన బంతిని అతను స్వీప్ ఆడబోయాడు. అతను మిస్ అవడంతో బంతి అతని కాలి పక్క నుంచి వెళ్లి కీపర్ జోష్ ఇంగ్లిస్ చేతుల్లో పడింది. అయితే దాన్ని సరిగా కలెక్ట్ చేసుకోవడంలో ఇంగ్లిస్ విఫలమయ్యాడు. దీంతో అతని చేజారిన బంతి నేరుగా వెళ్లి వికెట్లపై పడింది.
స్వీప్ ఆడేందుకు ముందడుగు వేసిన మీకరన్ సరిగ్గా ఆ సమయానికి ఇంకా వెనక్కు రాలేదు. అతని కాలు క్రీజ్ లైన్ మీదనే ఉండిపోయింది. ఇది చూసిన ఇంగ్లిస్ అనుమానంగానే అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్ ఈ అవుట్‌ను పరిశీలించి మీకరన్‌ను అవుట్‌గా తేల్చాడు. దీంతో జంపా ఖాతాలో నాలుగో వికెట్ చేరింది.
అలాగే ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జంపా నిలిచాడు. ఇలా ఇంగ్లిస్ తడబాటుతో ఆసీస్ కూడా విజయతీరాలకు చేరుకుంది. ఇదంతా చూసిన ఫ్యాన్స్ మాత్రం.. ఇంత అదృష్టం మరే టీంకూ దక్కలేదని అంటున్నారు. ఈ మ్యాచులో అన్ని విషయాలు ఆసీస్‌ను గెలిపించేందుకే జరిగాయని చెప్తున్నారు.