ఆసీస్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ దెబ్బకు పసికూన నెదర్లాండ్స్ విలవిల్లాడింది. నెదర్లాండ్స్ బౌలింగ్ అటాక్‌ను ఊచకోత కోసిన మ్యాక్స్‌వెల్ బౌండరీల సునామీ సృష్టించాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ బాది వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. మ్యాక్స్‌వెల్ బాదుడుకు ఆసీస్ భారీ స్కోరు చేసింది.
ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ చెలరేగింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (104) వరుసగా రెండో మ్యాచులో సెంచరీతో చెలరేగాడు. అతనితోపాటు స్టీవ్ స్మిత్ (71), మార్నస్ లబుషేన్ (62) అర్థసెంచరీలతో మెరిశారు. తమ శైలికి భిన్నంగా ఆడిన స్మిత్, లబుషేన్ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

అయితే వార్నర్ అవుటైన తర్వాత ఆసీస్ బ్యాటింగ్ తడబడుతుందని అంతా అనుకున్నారు. స్టొయినిస్ స్థానంలో ఆడుతున్న కామెరూన్ గ్రీన్ (8) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో ఆసీస్ వేగానికి బ్రేకులు పడినట్లే అనిపించింది. ఇలాంటి సమయంలో 40వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
వచ్చీ రావడంతోనే నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీల మోత మోగించిన అతను.. ఏకంగా 9 ఫోర్లు, 8 సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే సెంచరీ బాది వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
మ్యాక్స్‌వెల్ పరుగుల సునామీతో ఏకంగా 400 మార్కును అందుకునేలా కనిపించింది. కానీ సెంచరీ తర్వాత మ్యాక్స్‌వెల్ వెంటనే అవుట్ కావడంతో ఆ స్కోరుకు ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసి, నెదర్లాండ్స్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్ 4 వికెట్లతో రాణించగా బాస్ డీ లీడ్స్ 2 వికెట్లు, ఆర్యన్ దత్ ఓ వికెట్ దక్కించుకున్నారు.