వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ పోరాటం ముగిసింది. టోర్నీ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చిన ఈ జట్టు.. అందరి కన్నా ముందు సెమీస్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచులో 33 పరుగుల తేడాతో ఈ టీం ఓడింది.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తడబడింది. ట్రావిస్ హెడ్ (11), డేవిడ్ వార్నర్ (15) విఫలమయ్యారు. అయితే స్టీవ్ స్మిత్ (44), మార్నస్ లబుషేన్ (71), కామెరూన్ గ్రీన్ (47), స్టొయినిస్ (35) రాణించారు. చివర్లో ఆడమ్ జంపా (29) వేగంగా పరుగులు చేయడంతో ఆ జట్టు 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లతో చెలరేగాడు.

ఇక ఛేజింగ్‌లో ఇంగ్లండ్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. స్టార్క్ వేసిన బంతిని ఆడబోయిన జానీ బెయిర్‌స్టో (0) ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జో రూట్ (13) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే డేవిడ్ మలాన్ (50), బెన్ స్టోక్స్ (64) ఇద్దరూ రాణించారు. మొయీన్ అలీ (42), క్రిస్ వోక్స్ (32) క్రీజులో ఉన్నంత సేపు కూడా ఇంగ్లండ్ గెలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకున్నారు.
కానీ ఆ ఆశలు కాసేపటికే ఆవిరయ్యాయి. ఇంగ్లండ్ జట్టు 48.1 ఓవర్లలో 253 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా మూడు వికెట్లు తీసుకున్నాడు. పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో రెండు వికెట్లతో రాణించారు. ఈ ఓటమి చాలా డిసప్పాయింటింగ్‌గా ఉందని ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ అన్నాడు.
'ప్రతి మ్యాచ్ తర్వాత ఒకే తరహా మీటింగ్ పెట్టుకున్నట్లుంది. ఈరోజు కొంత మెరుగ్గా ఆడాం. కానీ ఫలితం మాత్రం మారలేదు. ఇది మాకు చాలా లో పాయింట్. ఇక్కడకు వచ్చేటప్పుడు ఎన్నో అంచనాలతో వచ్చాం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉండటం చాలా కష్టంగా ఉంది. చాలా బాధగా కూడా ఉంది. మాకు మేం న్యాయం చేసుకోలేకపోయాం. మళ్లీ 2019లా ట్రోఫీ గెలవడం కష్టమే. కానీ ఇక్కడకు వచ్చేటప్పుడు దాని కోసం పోరాడాలని అనుకున్నాం' అని బట్లర్ చెప్పాడు.
'ఫ్యాన్స్‌ను చాలా నిరాశ పరిచాం. ఆ భారం మనపైనే ఉంటుంది. ఆసీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశాం అనుకున్నాం. చివర్లో జంపా, స్టార్క్ భాగస్వామ్యం చికాకు కలిగించింది. వాళ్ల ఇన్నింగ్స్‌ను ఇంకాస్త వేగంగా ముగించాల్సింది. ఒక 30 పరుగులు అదనంగా ఇచ్చేశాం. వాటిని మేం చేయడంలో తడబడ్డాం. ఇక నా అవుట్ విషయానికొస్తే.. అదే కరెక్ట్ షాట్ అనుకుంటున్నా. కానీ సరిగా ఆడలేకపోయా' అన్నాడు.
'ఆ టైంలో ప్రత్యర్థులకై కొంత ఒత్తిడి పెంచొచ్చు అనుకున్నా. నా ఫామ్ చాలా చికాకు కలిగిస్తోంది. అదే అతి పెద్ద ఆందోళనకర అంశం అనిపిస్తోంది. మేం అద్భుతంగా ఆడాలని అనుకున్నాం. కానీ నా ఫామ్ కూడా జట్టును దెబ్బతీసింది. ఫామ్‌లోకి రావాలంటే ఆడుతూ ఉండటమే మార్గం. ఎంత దూరం పోతే అంత త్వరగా ఫామ్ అందుకుంటాం' అని పేర్కొన్నాడు.