వరల్డ్ కప్‌లో ఇప్పుడే జోరందుకుంటున్న ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వరుసగా రెండు పరాజయాలతో వరల్డ్ కప్ ప్రయాణం ప్రారంభించిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత గాడిన పడింది. వరుసగా నాలుగు విజయాలు సాధించి సెమీస్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఎదుర్కోవడానికి రెడీ అయింది.
ఇలాంటి సమయంలో ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. గాయం వల్ల అతను ఈ మ్యాచ్ ఆడటం లేదని తెలుస్తోంది. మరి ఆ తర్వాతి మ్యాచ్ సమయానికైనా అతను కోలుకుంటాడో లేదో తెలియదు. ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఇది ఆసీస్‌కు కచ్చితంగా గట్టి దెబ్బే అని ఫీలయ్యారు.

ఇదిలా వుండగా.. మరో స్టార్ ఆసీస్ ప్లేయర్ మిచెల్ మార్ష్ కూడా ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడటం లేదని తెలిసింది. ట్రావిస్ హెడ్ రీఎంట్రీ ఇచ్చే వరకు జట్టుకు ఓపెనర్‌గా అద్భుతమైన సేవలు అందించిన మార్ష్.. హెడ్ తిరిగి రావడంతో మూడో స్థానంలో ఆడుతున్న సంగతి తెలిసిందే. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టులో కీలకంగా మారిన అతను.. ఈ మ్యాచ్ ఆడకపోవడం కంగారూలకు పెద్ద సమస్యే.
కొన్ని కుటుంబ కారణాల వల్లనే మార్ష్ ఈ మ్యాచ్ ఆడటం లేదని, అతను పెర్త్‌కు బయలు దేరాడని తెలుస్తోంది. మళ్లీ వరల్డ్ కప్ జట్టుతో కలిసేందుకు అతను ఎప్పుడు వస్తాడో ఒక క్లారిటీ లేదు. అతను కనుక తిరిగి రావడం కుదరదంటే.. జట్టులో అతని స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాల్సి ఉంటుంది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

వరల్డ్ కప్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో మార్ష్ రాణించాడు. అతనికి ఈ టోర్నీలో బౌలింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో కేవలం 42 బంతులే వేసిన అతను రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇలా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. రెండు విభాగాల్లో మంచి టచ్‌లో ఉన్న మార్ష్ లేకపోవడంతో ఆసీస్ తడబడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.