ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీసును భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్ నెగ్గిన ఆనందం మాత్రం ఫ్యాన్స్‌లో కనిపించడం లేదు. ఎందుకంటే ఈ మూడు వన్డేల వల్ల టీమిండియాలో ఉన్న కొన్ని లోపాలు చాలా స్పష్టంగా బయటపడ్డాయి. వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి జట్లు కచ్చితంగా వీటిని యూజ్ చేసుకొని టీమిండియాను ఇబ్బంది పెట్టడం ఖాయం.
జడ్డూ బ్యాటింగ్:టీమిండియా కీ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. వరల్డ్ కప్‌లో అన్ని మ్యాచుల్లో జడ్డూ ఆడటం గ్యారంటీ అని చెప్పాలి. కానీ అతను బ్యాటింగ్‌లో దారుణంగా విఫలం అవుతున్నాడు. ఫుల్ టైం బౌలర్‌గా రాణిస్తున్న జడ్డూ.. బ్యాటింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. వరల్డ్ కప్ ముందు జరిగిన ఆసీస్ సిరీసులో కూడా బ్యాటుతో విఫలమయ్యాడు.

2011 వరల్డ్ కప్ క్వార్టర్స్, సెమీఫైనల్‌లో సురేష్ రైనా ఏడో స్థానంలో కీలక ఇన్నింగ్సులు ఆడాడు. ఆ పాత్ర పోషించాల్సిన జడ్డూ మూడో వన్డేలో ఓవర్‌కు 12 పైగా పరుగులు చేయాల్సిన స్థితిలో చాలా కష్టపడి 36 బంతుల్లో 35 పరుగులే చేశాడు. ఈ ఏడాది వన్డేల్లో 27 సగటుతో బ్యాటింగ్ చేసిన అతను 2021 నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.
బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు:వరల్డ్ కప్ ఆడే టీమ్స్ అన్నింట్లో అవసరమైతే బౌలింగ్ చేయగలిగే బ్యాటర్ లేని టీం భారత్ అనే చెప్పాలి. ప్రతి జట్టులో ఇలాంటి పార్ట్ టైం బౌలర్లు ఎవరో ఒకరు ఉన్నారు. ఆసీస్ వంటి జట్లలో ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఉండటం వల్ల టీంకు ఈ అవసరం రాకపోవచ్చు. కానీ ఒకవేళ పాండ్యా కనుక ఏదైనా మ్యాచ్ ఆడకుంటే ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది.
ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఈ సమస్య కొట్టొచ్చినట్లు కనిపించింది. పాండ్యా కనుక టీంలో లేకపోతే.. ఇటీవల బౌలింగ్ చేసిన అనుభవం ఉన్న బ్యాటర్ ఈ టీంలో ఎవరూ ఉండరు. భారత్‌లో పిచ్‌లు బౌలర్లకు పెద్దగా సహకరించవు. ఇలాంటి పిచ్‌లపై అదనంగా బౌలర్లు ఉండటం ఏ జట్టుకైనా కలిసొచ్చే అంశమే. ప్రధాన బౌలర్లలో ఎవరైనా విఫలమైతే.. ఇది టీమిండియాకు కచ్చితంగా పెద్ద సమస్యగా మారుతుంది.
శార్దూల్ వేస్ట్:ఆసియా కప్ నుంచి కూడా వరల్డ్ కప్‌లో మూడో పేసర్‌గా శార్దూల్ ఠాకూర్‌ను తీసుకుంటున్నారు. జట్టులో బ్యాటింగ్ డెప్త్ పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ అతనికి తన బ్యాటింగ్ సత్తా చూపించే అవకాశం పెద్దగా రాలేదు. ఇక బంతితో శార్దూల్ దారుణంగా తేలిపోయాడు. ముఖ్యంగా ఆసీస్ సిరీసులో విఫలమయ్యాడు.
అసలు శార్దూల్‌ను వరల్డ్ కప్ టీంలోకి తీసుకున్నప్పటి నుంచే పెద్ద గొడవ జరుగుతోంది. అతనికి అంత సీన్ లేదని.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెంటిలో పెద్దగా ప్రభావం చూపించలేడని చాలా మంది అన్నారు. ఆసీస్‌తో ఆడిన తొలి రెండు మ్యాచుల్లో శార్దూల్ బౌలింగ్ తేలిపోయింది.

ధారాళంగా పరుగులు ఇవ్వడంతోపాటు వికెట్లు తీయలేక తెల్లమొఖం వేశాడీ స్టార్ ప్లేయర్. వన్డేల్లో కేవలం 17 సగటుతో బ్యాటింగ్ చేస్తున్న శార్దూల్.. బౌలింగ్‌లో కట్టుదిట్టంగా తన కోటా కూడా పూర్తి చేయలేకపోతున్నాడు. ఇంత చెత్త ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను వరల్డ్ కప్‌లో ఆడించడం టీమిండియాకు పెద్ద రిస్కే అని చెప్పాలి.
బ్యాటింగ్ ఇష్యూ:వరల్డ్ కప్‌లో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లలో టీమిండియా ఒకటి. కానీ వీరికి అతి పెద్ద సమస్య.. పార్ట్ టైం ఆఫ్‌స్పిన్నర్లు. ఆసీస్‌తో మూడో వన్డేలో మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారత్ ఏకంగా 4 వికెట్లు కోల్పోవడం చూసి అంతా షాకయ్యారు. కానీ ఇదేం కొత్త కాదు. ఆసియా కప్‌లో చరిత్ ఆశలంక, మెహదీ హసన్ కూడా భారత్‌ను ఇలాగే దెబ్బతీశారు.
రోడ్ వంటి రాజ్‌కోట్ పిచ్‌పై కూడా మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌ను టీమిండియా ఎదుర్కోలేకపోవడం చూసిన ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతున్నారు. ఈ సమస్యను వరల్డ్ కప్‌లో మిగతా జట్లు కచ్చితంగా నోటీస్ చేసి ఉంటాయి. దీన్ని కచ్చితంగా వాళ్లు భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటారు.