వరల్డ్ కప్‌లో సంచలన విజయాలు నమోదు చేసిన రెండు జట్లు ఢీకొట్టేందుకు రెడీ అయ్యాయి. మెగాటోర్నీలో దూసుకెళ్తున్న సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఏకైక టీం నెదర్లాండ్స్, పాకిస్తాన్‌పై విజయంతో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.
పూర్తిగా బౌలింగ్‌కు సహకరించే ఈ పిచ్‌పై ఛేజింగ్ చేయడం కష్టమే అని నిపుణుల అభిప్రాయం. కొన్నిరోజుల క్రితం భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచులో కూడా ఇదే నిజమైంది. 230 పరుగుల లక్ష్యాన్ని కూడా ఇంగ్లండ్ ఛేదించలేకపోయింది. ఐపీఎల్‌లో కూడా ఇక్కడ బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో అందరూ చూశారని నిపుణులు చెప్తున్నారు.

ఇక ఈ మ్యాచులో నెదర్లాండ్స్ సారధి స్కాట్ ఎడ్వర్డ్స్ టాస్ గెలిచాడు. తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. మంచి స్కోరు చేసి, దాన్ని డిఫెండ్ చేసుకుంటామని ఎడ్వర్డ్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తమ టీం టాపార్డర్ పరుగులు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. వాళ్లు కనుక రాణిస్తే తాము కూడా భారీ స్కోర్లు చేయగలమనే ధీమా వ్యక్తం చేశారు.
తమ టీంలో ఒకే ఒక్క మార్పు చేశామని చెప్పాడు. ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ ఆడటం లేదని, అతని బదులుగా బారెసీ ఓపెనర్‌గా వస్తాడని చెప్పాడు. అయితే విక్రమ్ స్థానంలో ఎవరిని తీసుకుందీ మాత్రం ఎడ్వర్డ్స్ చెప్పలేదు. ఇక ఆఫ్ఘన్ కెప్టెన్ షాహిదీ మాట్లాడుతూ.. తాను టాస్ గెలిచి ఉంటే తను కూడా ముందుగా బ్యాటింగే చేసే వాడినన్నాడు.
ఆ తర్వాత పిచ్ మంచి టర్న్ ఇస్తుందని అనుకుంటున్నట్లు చెప్పాడు. తమ టీంలో కూడా ఒక మార్పు చేశామన్నాడు. పేసర్ నవీన్ ఉల్ హక్ స్థానంలో యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఆడుతున్నట్లు తెలిపాడు. ఈ వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు దక్కుతున్న మద్దతును మాటల్లో వర్ణించలేనన్నాడు. ఈ మ్యాచ్ కూడా గెలుస్తామని అనుకుంటున్నట్లు చెప్పాడు.