డిఫెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేసిన ఆనందం ఆఫ్ఘన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్‌కు లేకుండా పోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచులో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆఫ్ఘన్‌కు అద్భుతమైన ఆరంభం అందించిన అతను 57 బంతుల్లో 80 పరుగులు చేసి.. తొలి వరల్డ్ కప్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ అతని ఆశ అడియాసే అయింది.
వెంట వెంటనే రెండు వికెట్లు పడటంతో క్రీజులోకి వచ్చిన ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ.. తన ఖాతా తెరిచేందుకు అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించాడు. దీని కోసం గుర్బాజ్‌ను తొందరపెట్టాడు. అయితే ఇంగ్లండ్ ఫీల్డర్ డేవిడ్ విల్లీ వేగంగా స్పందించి స్ట్రైకర్ ఎండ్ వైపు త్రో విసిరాడు. దీంతో సెంచరీ చేయకుండానే గుర్బాజ్ మైదానం వీడాల్సి వచ్చింది.

ఇలా అవుటవరడంతో గుర్బాజ్‌కు ఎక్కడలేని కోపం వచ్చేసింది. వెళ్తూ వెళ్తూ చేతిలోని బ్యాటుతో బౌండరీ లైన్‌ను బలంగా కొట్టాడు. అక్కడ కనిపించిన ఒక కుర్చీపై కూడా ప్రతాపం చూపించాడు. ఇలా అతను చేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని ఐసీసీ భావించింది. దీంతో అతని మ్యాచ్ ఫీజులో ఏకంగా 50 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.2 ప్రకారం, గుర్బాజ్ లెవెల్-1 తప్పిదం చేశాడని అంతర్జాతీయ క్రికెట్ మండలి పేర్కొంది. క్రికెట్ పరికరాలను, దుస్తులను, గ్రౌండ్ ఎక్విప్‌మెంట్.. ఇలా దేనిపై కూడా ఆటగాళ్లు తమ కోపం చూపించకూడదు. చికాకులో అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డును ధ్వంసం చేసినా ఈ నిబంధన ప్రకారం తప్పేనని ఐసీసీ స్పష్టం చేసింది.
తను ఈ పొరపాటు చేసినట్లు గుర్బాజ్ కూడా అంగీకరించినట్లు ఐసీసీ తాజా ప్రకటనలో వెల్లడించింది. దీంతో మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవే వేసిన జరిమానాను కూడా అంగీకరించాడట. గత రెండేళ్లలో ఇది గుర్బాజ్ చేసిన తొలి తప్పిదమని, ఇక్కడి నుంచి రెండేళ్లలో అతను నాలుగు కన్నా ఎక్కువ డీమెరిట్ పాయింట్స్ అందుకుంటే కొంత కాలం పాటు అతన్ని క్రికెట్ నుంచి నిషేధిస్తామని ఐసీసీ వివరించింది.