ప్రస్తుతం వరల్డ్ కప్‌లో అజేయంగా దూసుకుపోతున్న జట్టు టీమిండియా. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో భారత్ జయకేతనం ఎగరేసింది. వీటిలో కూడా ఒకటి, రెండు మినహా అన్ని మ్యాచుల్లో పూర్తి ఆధిపత్యం కూడా చెలాయించింది. ఇదంతా చూసిన అభిమానులు, నిపుణులు.. ఇదే జోరు కొనసాగిస్తే టీమిండియాను అడ్డుకోవడం అసాధ్యమని అంటున్నారు.
ఇప్పటికే 8 విజయాలతో 16 పాయింట్లు సాధించిన భారత జట్టు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తమ చివరి లీగ్ మ్యాచులో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచులో కూడా టీమిండియా విజయం సాధించడం దాదాపు ఖాయమేనని అందరూ అనుకుంటున్నారు. అంటే లీగ్ దశలో మొత్తం 9 విజయాలతో భారత జట్టు సెమీస్‌లో అడుగు పెడుతుందన్నమాట.

ఈ క్రమంలో ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కీలకమైన సలహా ఇచ్చాడు. భారత్ ఇప్పటి వరకు అద్భుతమైన ఆటతీరు కనబరిచిందని, అలాంటి జట్టును ఓడించడం కష్టమేనని గిల్‌క్రిస్ట్ అన్నాడు. అయినా సరే ఆసీస్ వంటి జట్ల వద్ద ఒక్క ఆప్షన్ ఉందని చెప్పాడు. నాకౌట్స్‌లో భారత్‌పై టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలని సూచించాడు.
దీనికి అతను చెప్పిన కారణం భారత బౌలింగ్ ఎటాక్. బుమ్రా, సిరాజ్, షమీ ఎంత డేంజరస్ బౌలర్లో చెప్పిన అతను.. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో లైట్ల కింద వాళ్లు చెలరేగుతున్నారని అన్నాడు. అందుకని వాళ్లను అడ్డుకోవడానికి ముందు వాళ్లకే బౌలింగ్ ఇవ్వాలని చెప్పాడు. 'ఇప్పటి వరకు టీమిండియా ఆడిన తీరు చూసిన తర్వాత.. టాస్ గెలిస్తే ఎవరైనా సరే ముందుగా బ్యాటింగ్ తీసుకోవాలని చెప్తా' అని గిల్‌క్రిస్ట్ తెలిపాడు.
'నేను చెప్పేది టీమిండియా ఛేజింగ్‌లో బలహీనంగా ఉందని కాదు. ప్రపంచంలోనే బెస్ట్ రన్ ఛేజర్ విరాట్ కోహ్లీ ఆ టీంలో ఉన్నాడు. ఇక ఛేజింగ్‌లో ఆ టీం వీక్‌గా ఎలా ఉంటుంది? కానీ సెకండ్ ఇన్నింగ్సులో, ఫ్లడ్ లైట్ల వెలుగులో భారత బౌలింగ్ ఎటాక్ ప్రదర్శన చూశారా? సిరాజ్, షమీ, బుమ్రా ముగ్గురూ నిప్పులు చెరుగుతున్నారు. వాళ్లను కనీసం ఆడలేకపోతున్నారు' అని చెప్పాడు.
'అలాంటి వాళ్లను ఏమాత్రం ఎదుర్కోవాలన్నా కూడా మధ్యాహ్నం ఎండలో ఎదుర్కోవడమే బెస్ట్ అని నా అభిప్రాయం' అని వివరించాడు. అలాగే భారత్ ఎక్కువగా స్పిన్నర్లపై ఆధార పడేదని, కానీ విదేశాల్లో రాణించడానికి పేసర్లు అవసరమని వాళ్లు గుర్తించారన్నాడు. డెన్నిస్ లిల్లీ ఉన్న ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీ, ఇప్పుడు గ్లెన్ మెక్‌గ్రాత్ ఈ విషయంలో భారత్‌కు బాగా ఉపయోగపడ్డారని చెప్పాడు.