టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా వన్డేల్లో అతన్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కావడం లేదు. ఇప్పటి వరకు 35 వన్డే మ్యాచులు ఆడిన అతను 66.10 సగటు, 102 స్ట్రైక్ రేటుతో 1917 పరుగులు చేశాడు. వరల్డ్ కప్‌లో కూడా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి టీమిండియాకు మంచి ఆరంభాలు అందించాలని గిల్ ఉవ్విళ్లూరుతున్నాడు.
ఈ క్రమంలో వరల్డ్ కప్‌లో కూడా గిల్ చెలరేగుతాడని మాజీ దిగ్గజం ఆకాష్ చోప్రా అంటున్నాడు. మెగాటోర్నీలో గిల్ తన బెస్ట్ ఫామ్ చూపిస్తాడని అంచనా వేస్తున్నాడు. అక్టోబర్ 5న వరల్డ్ కప్ మొదలవుతుందనే సంగతి తెలిసిందే. అయితే భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను 8వ తేదీన ఆడుతుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచులో ఆస్ట్రేలియాను భారత జట్టు ఢీకొంటుంది.

ఈ సందర్భంగా గిల్ గురించి మాట్లాడిన చోప్రా.. 'ఈ మెగాటోర్నీలో గిల్ అదరగొడతాడు. గట్టిగా మాట్లాడితే టీమిండియా టాపార్డర్ చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా రికార్డులు బద్దలు కొడతారు. గిల్ ఈ టోర్నీలో చాలా పరుగులు చేస్తాడు. కనీసం రెండు సెంచరీలు ఖాయం. వీటిలో ఒకటి భారీ శతకం అవుతుంది' అని జోస్యం చెప్పాడు.
గిల్ కనుక మూడు సెంచరీలు చేస్తే.. అతను అలసిపోని మ్యాచులో ఒక భారీ శతకం చేస్తాడని చోప్రా అభిప్రాయపడ్డాడు. గిల్ ఒక క్వాలిటీ ప్లేయర్ అని, ఈ వరల్డ్ కప్‌లో రాణించడం గ్యారంటీ అని చెప్పుకొచ్చాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ తన బలహీనతగా మారడంపై కూడా గిల్ పని చేశాడని చోప్రా చెప్పుకొచ్చాడు.
'ఒకానొక టైంలో ఎడం చేతి వాటం స్పిన్నర్లు గిల్‌ను తెగ ఇబ్బంది పెట్టినట్లు కనిపించింది. కానీ ఆసియా కప్ ఫైనల్‌లో ఎడం చేతి వాటం స్పిన్నర్లపై కూడా రాణించిన సంగతి మర్చిపోకూడదు. నన్నడిగితే అదే అనతి బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ ఇదే' అన్నాడు.