ఆఫ్ఘన్ చేతిలో దారుణంగా ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆఫ్ఘన్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోవడానికి కారణాలేంటని వెతికేపనిలో విశ్లేషకులున్నారు. ఇదే టైంలో కామెంటేటర్ ఆకాష్ చోప్రా ఇంగ్లండ్ జట్టుపై విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్ ఓటమికి బౌలర్లే కారణమంటూ ఇద్దరు బౌలర్లని టార్గెట్ చేశాడు ఆకాష్.
ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ చానల్లో ఇంగ్లండ్ ఓటమి గురించి విశ్లేషించాడు. 'ఇంగ్లండ్ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ఎంచుకోగానే నేను చాలా ఆశ్చర్యపోయాను. అది చిన్న గ్రౌండ్. పిచ్ కూడా ఫ్లాట్‌గా ఉండి పూర్తిగా బ్యాటింగ్‌కి అనుకూలించేలా ఉంది. అయితే బౌలింగ్ ఎంచుకోవడానికి పిచ్‌పై మంచు కురిసే అవకాశం ఉండడమేనని ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ చెప్పాడు. కానీ అదే పిచ్‌పై భారత్ సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు మంచు ప్రభావం పెద్దగా కనిపించలేదు. మరి ఇంగ్లండ్ బౌలింగ్ ఎందుకు ఎంచుకుందో అర్థమే కాలేద'న్నాడు.

అలాగే ఈ పిచ్‌పై ఇంగ్లండ్ లాంటి డెప్త్ బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు మొదట బ్యాటింగ్ చేసి ఉంటే కనీసం 350 నుంచి 400 పరుగులు చేసే అవకాశం ఉండేదని ఆకాష్ చెప్పుకొచ్చాడు. దానికి తోడు ఇంగ్లండ్ బౌలింగ్ లైనప్ ఆఫ్ఘన్ బ్యాటర్ల ముందు తేలిపోయింది. రీస్ టాప్లే ఒక్క మ్యాచ్‌లో బాగా ఆడాడు. క్రిస్ వోక్స్, శామ్ కర్రాన్ సగం సగం బౌలర్లలా కనిపించారన్నాడు. మార్క్ వుడ్ బాగా బౌలింగ్ చేసినా ఆశించినంతగా రాణించలేదు.

ఇక స్పిన్ విభాగంలో కేవలం ఒకే ఒక్క లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌తో ఇంగ్లండ్ బరిలోకి దిగడాన్ని కూడా ఆకాష్ తప్పుబట్టాడు. లియామ్ లివింగ్‌స్టోన్ 10 ఓవర్లు వేయగలిగే బౌలర్ అని, జో రూట్ కూడా ఎక్కువ ఓవర్లు వేయగలడు. కానీ వీటన్నింటినీ ఉపయోగించుకోవడంలో ఇంగ్లండ్ పూర్తిగా ఫెయిల్ అయిందని, ఇంగ్లండ్ ఓటమికి బౌలింగే కారణమని ఆకాష్ కంక్లూడ్ చేశాడు.