
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఇప్పుడు మంచి రసవత్తరంగా మారింది. బుధవారం జరిగిన పోరులో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో వరుస విజయాలతో దూసుకుపోతోన్న న్యూజిలాండ్‌కు గట్టి షాకిచ్చింది. దీంతో ప్రపంచకప్‌లో కివీస్‌కు తొలి పరాజయాన్ని చవిచూసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
టోర్నీలో మూడో విజయంతో పాక్ సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఓటమి పాలవడంతో మిగతా జట్లు సెమీస్ రేసులోకి దూసుకొచ్చాయి. షహీన్ అఫ్రిది (3/28), బాబర్ అజామ్ (101 నాటౌట్), హారిస్ సోహైల్ (68)లు పాక్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. నీషమ్ (112 బంతుల్లో 97 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడగా... గ్రాండ్‌హోమ్ (71 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. పాక్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది 3 వికెట్లు తీశాడు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 49.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసి గెలిచింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' బాబర్ ఆజమ్ (127 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు) అజేయ సెంచరీతో రాణించగా... హారిస్ సొహైల్ (76 బంతుల్లో 68; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతనికి మద్దతుగా నిలిచాడు.
ఈ ప్రపంచకప్‌లో పాక్ తన ఆశలను సజీవంగా ఉంచుకోవడంలో కీలకపాత్ర పోషించిన బాబర్ ఆజాం, షాహీన్ అఫ్రిదిలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.