
మాంఛెస్టర్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు. వారి దెబ్బకు తన పది ఓవర్ల కోటాను కూడా ముగించలేక చేతులెత్తేశాడు రషీద్ ఖాన్. తొమ్మిది ఓవర్లలోనే సెంచరీ మార్క్ దాటించేశారు. 54 బంతుల్లో 110 పరుగులను పిండుకున్నారు. ఫలితంగా- 50 ఓవర్లలో 397 పరుగుల అతి భారీ స్కోరును నమోదు చేసింది ఇంగ్లండ్ టీమ్.
రషీద్ ఖాన్ బౌలింగ్‌పై పెద్దగా విమర్శలు రాలేదు గానీ.. ఐస్‌లాండ్ క్రికెట్ మాత్రం కొన్ని సెటైర్లు వేసింది. ప్రపంచకప్ 2019లో ఓ బౌలర్ అతి వేగంగా సెంచరీ మార్క్‌ను అందుకున్నారని ఎకసెక్కాలు చేసింది. 56 బంతుల్లోనే 110 పరుగుల చేశారని పేర్కొంది. ఇప్పటిదాకా జరిగిన అన్ని ప్రపంచకప్ టోర్నమెంట్‌లల్లో ఓ బౌలర్ ఇంత ఫాస్ట్‌గా సెంచరీని చేయలేదని, రషీద్ ఖాన్ దాన్ని ఆ మైలురాయిని అందుకున్నారని అంటూ ఓ ట్వీట్ వేసింది.
ఐస్‌లాండ్ క్రికెట్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ కామెంట్‌పై విమర్శలు చెలరేగాయి. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ల్యూక్ రైట్ ఈ ట్వీట్‌ను తప్పుపట్టారు. క్రికెట్‌ను క్రికెట్‌గా మాత్రమే చూడాలంటూ హితవు పలికారు. దీన్ని ఓ రబ్బిష్ ట్వీట్‌గా కొట్టి పడేశారు. సెటైర్లు వేయడానికి బదులుగా ఆ క్రికెటర్ పట్ల మర్యాదగా ట్వీట్ చేసి ఉండాల్సిందని సూచించారు. తోటి క్రికెటర్‌కు గౌరవం ఇవ్వడం అంటే క్రికెట్‌ను గౌరవించుకున్నట్టేనని అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు తాను నైతికంగా మద్దతు ఇస్తున్నానని, రషీద్ ఖాన్ త్వరలోనే మెరుగైన బౌలింగ్ చేయగలుగుతారని చెప్పారు. లూక్ రైట్‌తో పాటు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ సైతం రషీద్‌ఖాన్‌కు మద్దతుగా నిలిచారు. రషీద్ ఖాన్ వరల్డ్ క్లాస్ బౌలర్ అని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పారు. ప్రతి బౌలర్‌కూ దుర్దినాలు వస్తాయని అన్నారు.