
హైదరాబాద్: ఏప్రిల్ 15(మంగళవారం) ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టుని వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వరల్డ్‌కప్ కోసం జట్టుని ఎంపిక చేయడం కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ గతంలో మాదిరి సాధారణ గణంకాలను కాకుండా సరికొత్త విధానాన్ని అవలంభించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
వరల్డ్‌కప్ కోసం జట్టుని ప్రకటించడానికి ముందు సెలక్షన్ కమిటీ ముంబైలో ప్రత్యేకంగా బీసీసీఐ పాలకుల కమిటీతో సమావేశమైంది. ఈ సమావేశానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం హాజరయ్యాడు. ఈ సమావేశంలో గతంలో మాదిరి కాకుండా 'డేటా అనలిటిక్స్'ను ఉపయోగించుకున్నారు.
దాదాపు మూడున్నర గంటల పాటు వరల్డ్ కప్ జట్టు ఎంపిక రేసులో ఉన్న అందరి ఆటగాళ్లకు సంబంధించిన డేటాను డేటా అనలిటిక్స్ రూపంలో ప్రజెంటేషన్ చేశారు. ఈ అనలిటిక్స్ ప్రజెంటేషన్‌ను భారత క్రికెట్ జట్టు డేటా అనలిస్ట్ సీకేఎం ధనుంజయ్ ఇచ్చారు. ఇంగ్లాండ్ పరిస్థితులపై ఏయే ఆటగాళ్లు ప్రభావం చూపుతారో ఇందులో స్పష్టంగా వివరించారు.
ఈ ప్రజెంటేషన్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి తిలకించారు. ఇందులో ఆటగాళ్ల బలాలు, బలహీనతలు, అవకాశాలు, SWOT analysis (Strength Weakness Opportunities Threat) లాంటి పూర్తి సమాచారం అందించారు.
'ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు భారత చైనామన్ స్పిన్నర్లను ఎలా ఎదుర్కొన్నారు... ఆర్దోడాక్స్ ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఆస్ట్రేలియా ఎలా దెబ్బతీసింది లాంటి వివరాలను సెలక్టర్లకు చూపించారు. దీంతో పాటు ప్రత్యర్థి జట్లు, ఆటగాళ్లపై మన బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఎలా ఆడారో లాంటివి సెలక్టర్లకు సరైన జట్టుని ఎంపిక చేసేందుకు ఉపయోగపడ్డాయి" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.