అంఫైర్ అత్యుత్సాహం: కొంపముంచిన ఓవర్‌త్రో, 5 పరుగులకు బదులు 6?

హైదరాబాద్: లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ న్యూజిలాండ్‌కి విజయావకాశాలు ఉన్నప్పటికీ, మార్టిన్ గుప్టిల్ వేసిన ఓవర్‌త్రో మ్యాచ్‌నే మలుపు తిప్పింది. కివీస్ నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్‌కు చివరి ఓవర్‌లో.. ఓవర్‌త్రో రూపంలో ఆరు పరుగులు వచ్చాయి. ఇదే, న్యూజిలాండ్ ఓటమికి కారణమైంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అసలేం జరిగిందంటే?
ఇంగ్లాండ్ విజయానికి ఆఖరి ఓవర్ చివరి మూడు బంతులకు గాను 9 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు ట్రెంట్‌బౌల్ట్ బౌలింగ్ చేయగా బెన్‌స్టోక్స్ డీప్ మిడ్ వికెట్ దిశగా బాదాడు. రెండు పరుగులు తీశాడు. రెండు పరుగులతోనే ఆగిపోవాల్సిన పరిస్థితి అది. రెండో పరుగును కోసం ప్రయత్నించిన సమయంలో బెన్ స్టోక్స్ కీపర్ ఎండ్‌కు వెళ్తూ రనౌట్ నుంచి తప్పించుకోవడానికి క్రీజులోకి డైవ్ చేశాడు.

స్టోక్స్ బ్యాట్‌ను తాకి బంతి బౌండరీకి
న్యూజిలాండ్ ఫీల్డర్ నుంచి వచ్చిన బంతి స్టోక్స్‌కు తగిలి బౌండరీకి తరలింది. దీంతో ఆ బంతికి మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. స్టోక్స్ మొదట చేసిన రెండు పరుగులతో పాటు.. బంతి బౌండరీని తగలడం వల్ల వచ్చిన నాలుగు పరుగులను ఇంగ్లండ్ ఖాతాలో వేశారు. దీంతో ఇంగ్లాండ్ విజయ సమీకరణం రెండు బంతుల్లో మూడు పరుగులుగా మారింది. ఆ తర్వాత బెన్ స్టోక్స్ మళ్లీ రెండు పరుగులకు ప్రయత్నించాడు.

చివరి బంతికి రెండు పరుగులు
ఒక పరుగు పూర్తిచేసి రెండో పరుగుకు వెళ్తుండగా అదిల్‌రషీద్ రనౌటయ్యాడు. దీంతో చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. స్టోక్స్ మళ్లీ రెండు పరుగులకు ప్రయత్నించగా ఈసారి మార్క్‌వుడ్ రెండో పరుగుకు రనౌటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
ఓవర్‌త్రోలో ఆరు పరుగులు ఇవ్వాలా లేక ఐదు పరుగులు ఇవ్వాలా?
అయితే ఓవర్‌త్రోలో ఆరు పరుగులు ఇవ్వాలా లేక ఐదు పరుగులు ఇవ్వాలా అన్నది ఐసీసీనే అధికారికంగా ప్రకటించింది. ఐసీసీలోని 19.8 రూల్ ప్రకారం.. ఓవర్‌త్రో రూపంలో బంతి బౌండరీ వెళ్లినా లేక ఫీల్డర్ కావాలని అడ్డుకున్నప్పుడు బంతి బౌండరీ దాటిన సందర్భాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో 19.8 రూల్ చెబుతుంది. ఆ రూల్ ప్రకారం ఇంగ్లాండ్‌కు 5 పరుగులు మాత్రమే ఇవ్వాలి. కానీ, అంపైర్ ధర్మసేన తన సహచరులతో చర్చించి ఆరు పరుగులు ఇచ్చాడు.

కేన్ విలియమ్సన్ మాత్రం హుందాగా
దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. 19.8 రూల్‌లోని ఓ క్లాజ్ ప్రకారం.. ఇద్దరు బ్యాట్స్‌మెన్లు.. ఫీల్డర్ బంతిని అందుకుని త్రో వేసే లోపు క్రాస్ చేయలేదు. ఆ లెక్క ప్రకారం బ్యాట్స్‌మెన్ రెండు పరుగులు చేసినా.. ఖాతాలో ఒక్క రన్ మాత్రమే జత చేయాలి. కానీ, అంఫైర్ ధర్మసేన ఆరు పరుగులు ఇవ్వడంతో ఇప్పుడు సర్వాత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాత్రంజట్టు ఓటమిలో ఎవ్వర్నీ తప్పుపట్టలేమని అన్నారు. నిబంధనలు ఎలా ఉన్నాయో తనకు తెలియవని, అందుకే- వాటిని అడ్డు పెట్టుకుని తాను ఐసీసీని గానీ, ఇంకెవర్ని గానీ విమర్శించలేమని చెప్పారు. బౌండరీల ద్వారా విజేతను ప్రకటిస్తారనే విషయం తనకు ఇప్పటిదాకా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తమ ఫీల్డర్ విసిరన త్రోకు బెన్‌స్టోక్స్ బ్యాట్ తగిలి బంతి బౌండరీకి వెళ్లడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. తమ జట్టును దురదృష్టం వెంటాడిందని, అందువల్లే ఇలాంటి అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications