అక్లాండ్: తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా ఓటమి, న్యూజిలాండ్ గెలుపు పైన పలువురు స్పందించారు. విన్నింగ్ షాట్.. సిక్స్ కొట్టిన ఇలియోట్ మాట్లాడుతూ.. గెలుపు సిక్స్ కొట్టినప్పుడు తన మదిలో ఎలాంటి ఆలోచన లేదని, అసలు ఎక్కడకు వెళ్లిందో కూడా తెలియదని, చాలా గొప్పగా ఉందన్నాడు. ఈ విజయం తన ఒక్కడిది కాదని, జట్టు మొత్తానిదన్నాడు. తొలిసారి ఫైనల్‌కు చేరామని, ఫైనల్‌ను మరో మ్యాచ్‌లాగే చూస్తామన్నాడు.
సౌతాఫ్రికా జట్టు గట్టి పోటీని ఇచ్చిందని, అంతిమంగా గొప్ప క్రికెట్ ఆడామని, దీనిని ఎవరు మరిచిపోలేరని మెకల్లమ్ అన్నాడు. ఏబీ డివిల్లియర్స్ ఊపందుకున్నప్పుడు వర్షం ఇలాగే పడుతుండాలని కోరుకున్నానని, సవరించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే మెదట్లోనే మెరుగైన రన్ రేట్ అవసరమని భావించామన్నాడు. దూకుడుగా ఆడామని, ఇలియోట్ అద్భుతంగా ఆడాడని చెప్పాడు. ఫైనల్లో ఇలాగే ఆడితే కప్ సొంతం చేసుకుంటామన్నాడు.

న్యూజిలాండ్ అసాధరణంగా ఆడిందని, ఆ జట్టు ఫైనల్‌కు అర్హమైనదని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఒత్తిడిని జయించారన్నాడు. ఇలియోట్ క్యాచ్‌ను వదిలి వేయడమే కాకుండా.. మ్యాచ్‌లో అవకాశాలను దక్షిణాఫ్రికా వృథా చేసిందని, ఒత్తిడికి లోనయిందన్నాడు. నాకౌట్ గెలవడం మాత్రం సఫారీలకు ఊరట అన్నాడు.
గొప్ప మ్యాచ్ అని, దక్షిణాఫ్రికో ఓడిపోలేదని, న్యూజిలాండ్ మాత్రం గెలిచిందని, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తలెత్తుకునే ప్రదర్శన చేశారని మాజీ క్రికెటర్ జాక్ కలిస్ అన్నాడు. దక్షిణాఫ్రికా ఈసారి తడబడలేదని, మరో మెరుగైన జట్టు చేతిలో ఓడింది అంతే అన్నాడు. డివిల్లియర్స్ జట్టును బాగా నడిపించాడని చెప్పాడు. దక్షిణాఫ్రికా పోరాడి ఓడిందని కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ అన్నాడు.
అంతిమంగా క్రికెట్ గెలిచిందని బ్రయాన్ లారా అన్నాడు. దక్షిణాఫ్రికా తలెత్తుకొని టోర్నీని నిష్క్రమించిందని ఆస్ట్రేలయా మాజీ స్పిన్నర్ షేర్న్ వార్న్ అన్నాడు. దక్షిణాఫ్రికా శాయశక్తులా పోరాడిందని, ఆ ఆటగాళ్లను చూసి ఎవరైనా జాలిపడతారని లక్ష్మణ్ అన్నాడు. సెమీ ఫైనల్లో ఓడిన జట్టును చూస్తే చాలా బాధగా ఉంటుందని, దక్షిణాఫ్రికా పోరాడి ఓడిందని సచిన్ టెండుల్కర్ అన్నాడు. సౌతాఫ్రికా కంటతడి కలచివేసిందని కుంబ్లే అన్నాడు.