మెల్‌బోర్న్: వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్ చేతిలో బంగ్లా పరాజయంపై ఆ దేశ క్రికెట్ బోర్డ అధ్యక్షుడిగానే కాకుండా, ఐసీసీ అధ్యక్షుడి హోదాలో సంచలన వ్యాఖ్యలు చేసిన ముస్తఫా కమల్ మాట మార్చారు.
మార్చి 19న వరల్డ్ కప్ రెండో క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్ధాన్ అంఫైర్ అలీమ్ దార్ తప్పుడు నిర్ణయాల వల్లే తమ జట్టు ఓడిపోయిందని వ్యాఖ్యానించిన ముస్తఫా కమల్, అంఫైర్ల తప్పుడు నిర్ణయాలకు నిరసనగా ఐసీసీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడనని చెప్పిన విషయం తెలిసిందే.
ముస్తఫా కమాల్ రాజీనామా వ్యాఖ్యలకు బంగ్లాదేశ్ ప్రధాని హసీనా సైతం సమర్ధించారు. అయితే ఆ మరునాడే కమాల్ మాట మార్చేశారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని పేర్కొన్నారు. ఐసీసీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నానంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తమని ఆయన ఆదివారం ప్రకటించారు.

ఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పారు. భారత్-బంగ్లా మ్యాచ్ సందర్భంగా అంఫైర్ల తప్పిదాలపై ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమాల్ చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ పేర్కొన్నారు.
ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా మార్చి 19(గురువారం)న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ Vs బంగ్లాదేశ్ మధ్య రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలో టీమిండియా అద్భుతంగా రాణిస్తుండగా, బంగ్లా బౌలర్ రుబెల్ వేసిన 40వ ఓవర్‌లో పుల్ టాస్ బంతిని రోహిత్ శర్మ డీప్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు.
బంతి ఫీల్డర్ చేతిలో పడింది. బంగ్లా ఆటగాళ్లు సంబరాలకు సిద్ధమవుతుండగానే.... మైదానంలో ఉన్న అంఫైర్ అలీమ్ దార్ నో బాల్ ఇచ్చాడు. ఐతే బంతి నడుము కంటే తక్కువ ఎత్తులోనే వెళ్తున్నట్లు రీప్లేలో తేలింది. అప్పటికే రోహిత్ శర్మ 90 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎదుర్కొన్న 24 బంతుల్లో రోహిత్ శర్మ 46 పరుగులు చేశాడు.