
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విరాట్ కోహ్లీలాగా ఆడే క్రికెటర్ల అవసరం ఎంతైనా ఉందని ఐసీసీ చీఫ్ ఎక్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ అన్నారు. కోహ్లీతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ ద్రవిడ్ లాంటి వారు కూడా కీలకమని పేర్కొన్నారు.
ఎంసీసీ 2018 స్ఫిరిట్ ఆఫ్ క్రికెట్ కౌడ్రె ప్రసంగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రికెట్‌లో మోసం, స్లెడ్జింగ్ తదితర అంశాలపై మాట్లాడారు. "మైదానంలో ప్రాణం పెట్టి ఆడే క్రికెటర్ల అవసరం క్రికెట్‌కు ఎంతైనా ఉంది. కొలిన్ మిల్‌బర్ను, ఫ్రెడ్డీ ఫ్లింటాఫ్, షేర్న్ వార్న్, విరాట్ కోహ్లీ, బెన్‌స్టోక్స్ లాంటివారు. వీరితో పాటు క్రికెట్‌కు ఫ్రాంక్ వోరెల్స్, మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ ద్రవిడ్, కొలిన్ కౌడ్రెలూ కూడా కీలకమే" అని అన్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఎదుర్కొంటున్న చాలా సవాళ్లకు సమాధానాలు లేవని వాటిని పరిష్కరించడానికి సమష్టిగా పనిచేస్తున్నామని రిచర్డ్‌సన్ తెలిపారు. ప్రస్తుతం క్రికెట్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కోచ్‌లు, ఆటగాళ్ల చొరవ ఎంతైనా అవసరమని ఆయన తెలిపారు.
"వ్యక్తిగత దూషణ, ఔటైన బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరుతుంటే ఫీల్డర్లు అనుచిత సైగలతో సాగనంపడం, అనవసరంగా వాగ్వాదానికి దిగడం, అంపైర్ల నిర్ణయాన్ని గౌరవించకుండా అక్కడే ఆడకుండా ఉండటం, బాల్ ట్యాంపరింగ్ చేయడం మన ఆటకు అనవసరం" అని అన్నారు.
"క్రీడాస్ఫూర్తిని కాపాడేందుకే ఈ విషయాలపై ఆటగాళ్లతో మాట్లాడుతున్నాం. పర్యాటక జట్లను గౌరవించాలని చెప్తున్నాం. ఆతిథ్య జట్టుకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో పర్యాటక జట్టుకూ అవే సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాల్ టాంపరింగ్ ఉదంతాన్ని గుర్తు చేశారు.
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. "కోచ్‌లు, టీమ్ మేనేజర్లు సైతం ఈ మధ్య తప్పుచేసిన ఆటగాళ్లను వెంటనే సమర్థిస్తున్నారు. క్రికెట్ అంతిమ లక్ష్యం గెలవడమే అయినప్పటికీ ఆటకున్న సమగ్రతను మాత్రం దెబ్బతీయకూడదు" అని రిచర్డ్‌సన్ పేర్కొన్నారు.