నాగ్‌పూర్: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యద్భుతంగా రాణించి భారత్ గెలుపునకు కారణమైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. అశ్విన్ ఒక ప్రపంచ స్థాయి స్పిన్నర్ అని కొనియాడాడు. అతని వల్లే టీమిండియా టెస్ట్ సిరీస్ సొంతం చేసుకో గలిగిందని చెప్పాడు.
నాగ్‌పూర్ విసిఏ స్టేడియంలో శుక్రవారం ముగిసిన మూడో టెస్ట్ చివరి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన అశ్విన్.. మ్యాచులో మొత్తం 12 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 2-0తో టెస్ట్ సిరీస్‌ను కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు కైవసం చేసుకుంది.
భారత ప్రధాన స్పిన్నర్ అశ్విన్ అని కోహ్లీ పేర్కొన్నాడు. 'అశ్విన్ ప్రపంచ స్థాయి స్పిన్నర్. శ్రీలంక పర్యటనలో కూడా అతడు అద్భుతంగా రాణించాడు. జట్టులో అతడు ఉండబట్టే తాము వరుసగా గెలుస్తున్నాం. అతని ప్రదర్శనే జట్టుకు బలం. అశ్విన్ లాంటి స్పిన్నర్ జట్టులో ఉన్నందుకు ఆనందంగా ఉంది' అని కోహ్లీ మ్యాచ్ విజయం అనంతరం తెలిపాడు.

అశ్విన్ తోపాటు రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రాలు కూడా అద్భుతంగా రాణించారని చెప్పారు. కాగా, ఈ త్రయమే మొత్తం 20 వికెట్లు పడగొట్టింది. 'ఇదే టెస్ట్ క్రికెట్ అంటే. ఎంతో ఓపిక అవసరం. మిశ్రా గొప్పగా ఆడాడు. ఈ సిరీస్‌లో స్పిన్నర్లదే పైచేయి' అని కోహ్లీ తెలిపాడు.
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లిసిస్, ఆమ్లా పోరాటం చేయగా.. తాము విజయం కోసం ప్రయత్నించి సఫలమయ్యామని తెలిపాడు. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా మూడో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. రెండో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 3న చివరిదైన నాలుగో టెస్ట్ ఢిల్లీలో జరగనుంది.