వరల్డ్ కప్‌లో ఓటమనేదే లేకుండా దూసుకుపోతున్న టీమిండియా ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. అయితే ఒక్క కివీస్ మ్యాచ్ మినహా.. మిగతా మ్యాచుల్లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. కానీ అతను గాయపడటం ఇప్పుడు టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారింది.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో ఆ తర్వాత న్యూజిల్యాండ్‌తో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా అతను దూరమయ్యేలా ఉన్నాడు. తాజా రిపోర్టుల ప్రకారం ముందు జాగ్రత్తగా పాండ్యాను ఈ మ్యాచ్‌లో కూడా ఆడించడం లేదని తెలుస్తోంది.

వరల్డ్ కప్ టోర్నీలో జోరుగా ముందుకు సాగాలంటే ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు చాలా కీలకం. ఇప్పుడు అతను లేకపోవడంతో జట్టుకు మూడు పెద్ద సమస్యలు వచ్చాయి.
టీం బ్యాలెన్స్
భారత్ ఆడే మిగతా మ్యాచుల్లో ఇంగ్లండ్ మ్యాచ్ టఫ్ అని చెప్పాలి. ఇలాంటి మ్యాచులో గెలవాలంటే జట్టులో బ్యాలెన్స్ చాలా ముఖ్యం. టీమిండియాలో ఆ బ్యాలెన్స్ చక్కగా మెయింటైన్ చేయాలంటే పాండ్యా ఎంతో కీలకం. ఇప్పుడు అతను లేకపోవడంతో టీం బ్యాలెన్స్ దెబ్బతినేలా ఉంది. కివీస్‌పై షమీ చెలరేగడంతో ఈ లోపం ఎవరికీ కనిపించలేదు. మళ్లీ అలాంటి ప్రదర్శననే షమీ నుంచి ఆశించడం అతిశయోక్తి అవుతుంది.
సూర్య ఫ్లాప్ షో
ఇక పాండ్యా స్థానంలో జట్టులోకొచ్చిన సూర్యకుమార్ యాదవ్ న్యూజిల్యాండ్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అటు బ్యాటింగ్‌లో అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఇటు ఫీల్డింగ్‌లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేదు. పాండ్యా చాలా మంచి ఫీల్డర్ కూడా. అలాంటి ప్లేయర్ స్థానాన్ని భర్తీ చేయడంలో సూర్య విఫలమయ్యాడనే చెప్పాలి.
బౌలింగ్ కష్టాలు
పాండ్యా పేస్ ఆల్ రౌండర్ కాబట్టి అతడు జట్టులో ఉంటే మరో స్పిన్నర్‌ను తీసుకునే అవకాశం టీమిండియాకు ఉంటుంది. పాండ్యా లేకపోతే జట్టులో పేసర్ కొరత ఏర్పడుతుంది. దాంతో మరో పేసర్‌ని తీసుకోవాల్సి వస్తుంది. శార్దూల్, షమీ ఇద్దరిలో ఎవర్ని తీసుకున్నా.. స్పిన్ విభాగాన్ని పటిష్టం చేసుకోవడం కష్టంగా మారుతుంది. అలా కాకుండా స్పిన్నర్‌ను తీసుకుంటే పేస్ బౌలింగ్ పదును తగ్గుతుంది.