
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై చర్చించడానికి 9మంది వైద్యనిపుణులతో కూడిన మెడికల్ బోర్డు సోమవారం సమావేశం కానుంది. సౌరవ్‌కు తదుపరి చికిత్స ప్రణాళికపై ఉడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి వైద్యులు (9 మంది మెడికల్ బోర్డు సభ్యులు) అయన కుటుంబ సభ్యులతో చర్చించనున్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు సమావేశమై చర్చించనున్నారు. దాదా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఉడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి వైద్యులు తాజా బులెటిన్‌లో తెలిపారు.
శనివారం సౌరవ్ గంగూలీ తన ఇంట్లోని వ్యాయామశాలలో శారీరక వ్యాయామం చేస్తున్నపుడు ఛాతీ నొప్పి, తల బరువు, వాంతులు, మైకంతో ఆసుపత్రిలో చేరారు. అదే రోజు వైద్యులు గంగూలీకి యాంజియో ప్లాస్టీ చేసి ఓ స్టెంట్ వేసిన సంగతి తెలిసిందే. మరో రెండు కూడా అవసరమని సమాచారం. అయితే దాదా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. గంగూలీ గుండె పనితీరును తెలుసుకునేందుకు ఆయనకు ఇవాళ ఎకోకార్డియోగ్రఫీ నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. 48 ఏళ్ల గంగూలీకి కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ అని వచ్చింది.
సౌరవ్ గంగూలీకి గుండెనొప్పి వచ్చిన నేపథ్యంలో ఆటలకు ముందు క్రికెటర్లకు వైద్య పరీక్షలు చేయాలని తాను బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అవిషేక్ ధాల్మియాకు సూచించానని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. గంగూలీ స్వల్ప గుండెపోటుకు గురయ్యారని తెలియడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, అభిమానులు ఆకాక్షించారు. సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ ఇప్పటికీ సందేశాలు పెడుతున్నారు.
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 7212 రన్స్, వన్డేల్లో 11363 పరుగులు చేశాడు. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ 59 మ్యాచ్‌లాడిన దాదా.. 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1349 పరుగులు చేశాడు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్ 10 వికెట్లని దాదా పడగొట్టారు. మీడియం పేస్ బౌలింగ్ దాదా ఆకట్టుకున్నాడు.