
వన్డే ప్రపంచకప్ చరిత్రలో బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్ ఉమెన్స్‌తో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ జట్టులో సిద్రా అమీన్ సెంచరీతో పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. అలాగే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా 18వ పరాజయం కావడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఫర్గానా హోక్ 71 పరుగులతో సత్తా చాటింది. నిగర్ సుల్తానా 46, షర్మిన్ అక్తర్ 44 పరుగులతో పర్వాలేదనిపించింది. పాక్ బౌలర్లలో నష్రా సంధు 3 వికెట్లు పడగొట్టింది.
235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు శభారంభాన్ని అందించారు. ఓపెనర్లు నహిదా ఖాన్, సిద్రా అమీన్ తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 43 పరుగులు చేసిన నహిదా ఖాన్‌ను రుమానా అహ్మద్ బోల్డ్ చేసింది. స్కోర్ 155 పరుగుల వద్ద ఉండగా 31 పరుగులు చేసిన కెప్టెన్ బిస్మా మరూఫ్ ఔటైంది. అనంతరం 182-2తో పటిష్ట స్థితిలో ఉన్న పాకిస్థాన్‌ను బంగ్లా బౌలర్లు దెబ్బ కొట్టారు. 6 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టారు. దీంతో ఒక్కసారిగా 188-7తో పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఓపెనర్ సిద్రా అమీన్ ఒంటరి పోరాటం చేసింది. టేలండర్లతో కలిసి పాకిస్థాన్‌ను విజయం దిశగా నడిపించింది. ఈ క్రమంలో సెంచరీ కూడా పూర్తి చేసుకుంది. దీంతో ఉమెన్స్ వన్డే ప్రపంచకప్‌లో సెంచరీ కొట్టిన తొలి పాకిస్థాన్ క్రీడాకారిణిగా సిద్రా అమీన్ రికార్డు సాధించింది. అయితే 48వ ఓవర్ చివరి బంతికి 104 పరుగులు చేసిన సిద్రా అమీన్ రనౌట్ కావడంతో సీన్ మారిపోయింది. మ్యాచ్ పాకిస్థాన్ చేతుల్లో నుంచి జారిపోయింది.
చివరకు నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు మాత్రమే చేసింది. దీంతో బంగ్లాదేశ్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. కీలక సమయంలో 3 వికెట్లు తీసి మ్యాచ్ ఫలితాన్నే మార్చేసిన ఫాహిమా ఖాతున్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ ఆరో స్థానానికి ఎగబాకింది.