మహిళల టీ20 ప్రపంచకప్ -2024లో భారత్ మరో కీలక సమరానికి సిద్ధమైంది. షార్జా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. సెమీఫైనల్స్‌కు చేరాలంటే ఇవాళ మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాలి. ప్రస్తుతం గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా (4 పాయింట్లు, +2.524), భారత్ (4 పాయింట్లు, +0.576), న్యూజిలాండ్ (4 పాయింట్లు, +0.282), పాకిస్థాన్ (2 పాయింట్లు, -0.488), శ్రీలంక (-2.173) వరుస స్థానాల్లో ఉన్నాయి.
అయితే గ్రూప్-ఏ సెమీస్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. అన్ని జట్లలో ఆస్ట్రేలియాకు మెరుగైన అవకాశం ఉంది. అయితే ఆసీస్ సెమీస్ అవకాశాలకు గ్యారెంటీ లేదు. ఇవాళ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 150 పరుగులు చేసి, 61 పరుగుల తేడాతో గెలిస్తే.. కంగారూల నెట్ రన్ రేటును అధిగమిస్తుంది. మరోవైపు పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ 77+ పరుగుల తేడాతో లేదా 58 బంతులు మిగిలుండగానే ఛేదిస్తే.. భారత్‌తో పాటు కివీస్ సెమీస్‌కు వెళ్తుంది, ఆసీస్ ఇంటిముఖం పడుతుంది.

ఆస్ట్రేలియాను సెమీస్‌కు రాకుండా చేయడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో భారత్-న్యూజిలాండ్ మధ్య సెమీస్ బెర్తు పోటీ తీవ్రంగా ఉండనుంది. ఇవాళ మ్యాచ్‌లో భారత్, రేపటి మ్యాచ్‌లో న్యూజిలాండ్.. మొదట బ్యాటింగ్/బౌలింగ్ ఎంచుకునే దాని బట్టి సెమీస్ సమీకరణాలు ఉన్నాయి. భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని, న్యూజిలాండ్ ఛేజింగ్ చేయాల్సిన సందర్భంలో.. భారత్ ఒక్క పరుగు తేడాతో గెలిస్తే, న్యూజిలాండ్ 14-16 బంతులు మిగిలుండగానే గెలవాలి.
అలాగే టీమిండియా 10 పరుగులతో గెలిస్తే.. కివీస్ 21-23 బంతులు; 20 పరుగుల తేడాతో విజయం సాధిస్తే.. 30-32 బంతులు మిగిలుండానే కివీస్ గెలవాలి. అప్పుడే భారత్ నెట్‌రన్‌రేటును న్యూజిలాండ్ అధిగమిస్తుంది. ఇక భారత్ ఛేజింగ్ చేసి, న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేస్తే.. భారత్ ఆఖరి బంతికి గెలిస్తే, కివీస్ 19-20 పరుగులతో నెగ్గాలి. 6/12 బంతులు మిగిలిస్తే.. కివీస్ 26/33 పరుగుల తేడాతో గెలవాలి.
ఇక భారత్, న్యూజిలాండ్ రెండు జట్లు మొదటే బ్యాటింగ్ చేస్తే.. భారత్ 1/10/20 పరుగుల తేడాతో గెలిస్తే, న్యూజిలాండ్ సెమీస్ బెర్తు కోసం 17/27/37 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇరు జట్లు తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఛేజింగ్ చేస్తే భారత్ 0/6/12 బంతులు మిగిలుండగా నెగ్గితే, కివీస్ 14/20/26 బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరాలి. అప్పుడే భారత్‌ను కివీస్ అధిగమించగలదు. లేదంటే ఆసీస్, భారత్ సెమీస్‌కు చేరుతుంది.
ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైనా భారత్ సెమీస్‌కు చేరే అవకాశం ఉంటుంది. అయితే న్యూజిలాండ్ కూడా పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలవ్వాలి. కివీస్, పాక్ కంటే టీమిండియా మెరుగైన నెట్‌రన్‌రేటుతో ఉండాలి.