మహిళల ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా షార్జా వేదికగా న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. ఆల్‌రౌండ్‌షోతో చెలరేగి కివీస్‌ను చిత్తుచిత్తుగా ఓడించి సెమీఫైనల్ అవకాశాలు మెరుగుపర్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
బెత్ మూనీ (40; 32 బంతుల్లో, 2 ఫోర్లు), ఎలిసా పెరీ (30; 24 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), ఎలిసా హీలి (26; 20 బంతుల్లో, 4 ఫోర్లు), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (18; 18 బంతుల్లో, 2 ఫోర్లు) పరుగులు చేశారు. ఈ టాప్-4 బ్యాటర్లు మినహా మిగిలినెవరూ రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు. కివీస్ బౌలర్లలో అమేలియా కెర్ నాలుగు వికెట్లు, బ్రూక్ హాలిడే, రోజ్మేరి మేయర్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఓ దశలో ఆస్ట్రేలియా 109/2తో మెరుగైన స్థితిలో ఉంది. కానీ కివీస్ బౌలర్లు గొప్పగా పుంజుకుని స్కోరుబోర్డును కట్టడిచేశారు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. అమేలియా కెర్ (29; 31 బంతుల్లో, 3 ఫోర్లు), సుజీ బేట్స్ (20; 27 బంతుల్లో, 2 ఫోర్లు), లియా తహుహు (11; 10 బంతుల్లో, 1 ఫోర్) మినహా ఎవరూ రెండంకెల స్కోరు అందుకోలేదు. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్, మేగన్ షట్ తలో మూడు వికెట్లు, సోఫీ రెండు వికెట్లు తీశారు.

ఈ విజయంతో ఆస్ట్రేలియా నెట్‌రన్‌రేటును భారీగా మెరుగుపర్చుకుంది. 4 పాయింట్లు, +2.524 నెట్‌రన్‌రేటుతో గ్రూప్-ఏలో టేబుల్ టాప్‌లో ఉంది. తర్వాతి స్థానంలో పాకిస్థాన్ (2 పాయింట్లు, +0.555), న్యూజిలాండ్ (2 పాయింట్లు, -0.05), భారత్ (2 పాయింట్లు, -1.217) ఉన్నాయి. పాయింట్ల ఖాతా తెరవని శ్రీలంక -1.667 నెట్‌రన్‌రేటుతో అట్టడుగున ఉంది. ఇవాళ దుబాయ్ వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరగనుంది.