Womens T20 World Cup: మహిళల టీ20 ప్రపంచ కప్ తేదీలను ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ కప్ ఫైనల్ జులై 5న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు ఉంటాయి. ఇది 24 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సారి 12 జట్లు పాల్గొంటాయి.
మహిళల టీ20 ప్రపంచ కప్ కు సన్నాహాలు ప్రారంభం
2026లో ఇంగ్లాండ్‌లో జరగనున్నమహిళల టీ20 ప్రపంచ కప్ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మే 1న లార్డ్స్ లో జరిగిన కార్యక్రమంలో వేదికలు, తేదీలను ప్రకటించారు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, సౌతాంప్టన్‌లోని హాంప్‌షైర్ బౌల్, లీడ్స్‌లోని హెడింగ్లీ, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్, లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్, బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రాండ్ కూడా ఈ టోర్నమెంట్‌కు వేదికలుగా ఉంటాయి.

తమ స్థానాన్ని నిర్ధారించుకున్న జట్లు ఇవే..
భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాప్రికా, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రపంచ కప్ లో తమ స్థానాన్ని నిర్ధారించుకున్నాయి. మిగిలిన జట్లను వచ్చే ఏడాది జరిగే క్వాలిఫయర్స్ నుంచి ఎంపిక చేస్తారు. ఐసీసీ ఛైర్మన్ జైషా మాట్లాడుతూ.. "వేదిక నిర్ధారణ ఒక ముఖ్యమైన క్షణం. మనం 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ వైపు అడుగులు వేస్తున్నాం. ఈ టోర్నమెంట్ ప్రపంచంలోని అత్యుత్తమ కీడాకారిణులను ఒక చోట చేర్చుతుంది. ఇది నైపుణ్యం, క్రీడాస్ఫూర్తికి ఒక వేడుక అవుతుంది." అని అన్నారు.
యూకేలో అన్ని జట్లకు ఎల్లప్పుడూ అపారమైన మద్ధతు లభించిందని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో కూడా మనం దీనిని చూశామన్నారు. 2017లో లార్డ్స్ లో జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్ ఒక చిరస్మరణీయ క్షణమని గుర్తు చేసుకున్నారు. మహిళా క్రికెట్ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయి అని అన్నారు. ఫైనల్ కు లార్డ్స్ కంటే మెరుగైన ప్రదేశం మరొకటి ఉండదని తాను భావిస్తున్నానన్నారు. 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మహిళల క్రికెట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిందని జైషా అన్నారు.
ఫార్మాట్ ఇలా..
12 జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. ఒక్కొక్క గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. దీని తర్వాత నాకౌట్ దశ, ఫైనల్ ఉంటుంది. న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్లు. గత ఏడాది అక్టోబర్‌లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో లారా వోల్వార్డ్ట్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో ఓడించారు. భారతదేశం ఇంకా ఈ టైటిల్ గెలవలేదు. 2020లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఫైనల్ ఆడింది.