మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్స్‌గా న్యూజిలాండ్ అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్ దేశానికి పురుషుల క్రికెట్ లేదా మహిళల క్రికెట్‌లో ఇదే మొదటి పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్. ఓవరాల్‌గా కివీస్ అమ్మాయిలకు ఇది రెండో ప్రపంచకప్. 2000 వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది.
అయితే ప్రపంచకప్ గెలవడానికి భారత్‌పై సాధించిన విజయమే కారణమని న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ పేర్కొంది. వరుసగా పది మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన కివీస్ గ్రూప్ దశలో మొదటి మ్యాచ్‌లో టీమిండియాపై 58 పరుగుల తేడాతో విజయం సాధిచి ఘనంగా టోర్నీని ఆరంభించింది. మెరుగైన రన్‌రేటుతో సెమీస్ అవకాశాలు మెరుగుపర్చుకుంది. అయితే టీమిండియాపై విజయం తమలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి ముందుకు సాగేలా చేసిందని డివైన్ తెలిపింది.

''ప్రపంచకప్ అందుకోవడం గొప్ప క్షణం. అయితే ఈ మెగాటోర్నీలో ఒక మంచి సందర్భం లేదా ఒక మ్యాచ్ గురించి చెప్పడం చాలా కష్టం. కానీ టీమిండియాపై విజయం మా ప్రదర్శనలో మలుపుగా చెప్పవచ్చు. దక్షిణాఫ్రికాలో జరిగిన గత ప్రపంచకప్ అనంతరం మేం చేసిన సంపూర్ణ ప్రదర్శన అదే'' అని సోఫీ డివైన్ పేర్కొంది.
టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాకముందే ఈ మెగాటోర్నీ అనంతరం కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతానని సోఫీ డివైన్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే విశ్వవిజేతగా తమ జట్టును నిలబెట్టడంతో తిరిగి సారథి బాధ్యతలు కొనసాగిస్తారా అని అడిగిన ప్రశ్నకు సోఫీ స్పందించింది. తన నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని తెలిపింది. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 158 పరుగులు చేసింది.
అమేలియా కెర్ (43; 38 బంతుల్లో, 4 ఫోర్లు) టాప్ స్కోరర్.బ్రూక్ హాలీడే (38; 28 బంతుల్లో, 3 ఫోర్లు), సుజీ బేట్స్ (32; 31 బంతుల్లో, 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంలాబా రెండు వికెట్లు, అయబోంగా ఖకా, ట్రయాన్, డిక్లెర్క్, సున్ లుజ్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో సౌతాఫ్రికా తొమ్మిది వికెట్లకు 126 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ వోల్వార్ట్ (33; 27 బంతుల్లో, 5 ఫోర్లు) పోరాడింది.
అయితే దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కింది. వోల్వర్ట్-తజ్మిన్ కలిసి తొలి వికెట్‌కు అర్ధశతక (51) భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. వీరిద్దరు కలిసి పవర్‌ప్లేలో 47 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత ఒత్తిడికి చిత్తయ్యారు. రోజ్‌మేరీ, అమేలియా కెర్ చెరో మూడు వికెట్లు, బ్రూక్ హాలీడే , కార్సన్ తలో వికెట్ తీశారు.