క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న మహిళల టీ20 ఆసియా కప్-2024కు స్టేడియంలో ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. జులై 19న మొదలుకానున్న ఈ ఆసియా మెగాటోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రారంభ మ్యాచ్‌లో యూఏఈతో నేపాల్ తలపడనుంది. అదే రోజున హైవోల్టేజ్ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
''అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్స్‌లో అన్ని మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. అంతేగాక స్టేడియంలో మ్యాచ్‌లను చూసేందుకు ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాం'' అని శ్రీలంక క్రికెట్ బోర్డు మీడియా ప్రకటన విడుదల చేసింది. ''ఏషియన్ క్రికెట్ మద్దతుతో ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించాలని శ్రీలంక భావిస్తోంది. ప్రపంచ వేదికపై మహిళల క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇది సాయపడుతుంది'' అని లంక బోర్డు వైస్ ప్రెసిడెంట్ విక్రమరత్నె చెప్పాడు.

జులై 28 వరకు సాగే ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఆయా గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, నేపాల్ ఉన్నాయి. అలాగే గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మలేసియా ఉన్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కాగా, అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోని దంబుల్లాలో జరగనున్నాయి. గ్రూప్ దశలో భారత్.. పాకిస్థాన్‌తో జులై 19న, యూఏఈతో జులై 21న, నేపాల్‌తో జూలై 23న తలపడనుంది. జులై 26న సెమీఫైనల్ 1, 2 జరగనున్నాయి. ఇక జులైన 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభంకానున్నాయి.
ఆసియా కప్ షెడ్యూల్ (వేదిక- దంబుల్లా)
జులై 19: యూఏఈ vs నేపాల్
జులై 19: భారత్ vs పాకిస్థాన్
జులై 20: మలేషియా vs థాయిలాండ్
జులై 20: శ్రీలంక vs బంగ్లాదేశ్
జులై 21: భారత్ vs యూఏఈ
జులై 21: పాకిస్థాన్ vs నేపాల్
జులై 22: శ్రీలంక vs మలేషియా
జులై 22: బంగ్లాదేశ్ vs థాయిలాండ్
జులై 23: పాకిస్థాన్ vs యూఏఈ
జులై 23: భారత్ vs నేపాల్
జులై 24: బంగ్లాదేశ్ vs మలేషియా
జులై 24: శ్రీలంక vs థాయిలాండ్
జులై 26: సెమీ ఫైనల్ 1
జులై 26: సెమీ ఫైనల్ 2
జులై 28: ఫైనల్