గత రెండు నెలలుగా పాకిస్థాన్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ సేన, దిగ్గజాల పోరులో భారత్ రిటైర్డ్ ప్లేయర్లు పాకిస్థాన్‌ను మట్టికరిపించారు. తాజాగా అదే జోరును భారత అమ్మాయిలు ప్రదర్శించారు. మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టును హర్మన్‌ప్రీత్ బృందం చిత్తుచిత్తుగా ఓడించింది.దంబుల్లా వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ షోతో సత్తాచాటి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. సిద్రా అమీన్ (25; 35 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. ఆఖర్లో ఫాతిమా సాహా (22 నాటౌట్; 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా పరుగులు చేసింది. దీప్తి శర్మ (3/20) మూడు వికెట్లతో చెలరేగింది. రేణుక ఠాకూర్ (2/14), పూజ వస్త్రాకర్ (2/31), శ్రేయాంక పాటిల్ (2/14) తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (45; 31 బంతుల్లో, 9 ఫోర్లు), షెఫాలీ వర్మ (40; 29 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) విజృంభించారు. ఛేదన ఆరంభం నుంచే ఓపెనర్లు దూకుడుగా ఆడటంతో భారత్ పవర్‌ప్లేలోనే 57 పరుగులు సాధించింది.
కాగా, మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విజయానికి గల కారణాలు వివరించింది. బౌలర్ల, బ్యాటర్ల ఉత్తమ ప్రదర్శనతో గెలిచామని చెప్పింది. అయితే క్రెడిట్ మాత్రం స్మృతి మంధాన, షెఫాలీ వర్మకు ఇవ్వాలని పేర్కొంది. వారిద్దరు విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును సునాయాసంగా గెలిపించారని తెలిపింది.
''మా బౌలర్లు, ఓపెనర్లు జట్టుకు విజయాన్ని అందించారు. మెగాటోర్నీల్లో మొదటి గేమ్ ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. కానీ మేం దాన్ని జయించాం. మా జట్టు అంతగా గొప్పగా ఆడింది. బౌలింగ్ గురించి చెప్పాలంటే.. ఆది నుంచే వికెట్లు సాధిస్తూ ప్రత్యర్థిపై పైచేయి సాధించాం. ఇక బ్యాటింగ్‌లో అయితే గొప్ప ఆరంభం దక్కింది. స్మృతి, షెఫాలీకి క్రెడిట్ ఇవ్వాలి. వారిద్దరు నిర్భయంగా ఆడుతున్నారు. ఇవాళ మా ప్రదర్శన ఎంతో బాగుంది'' అని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. కాగా, భారత్ ఆదివారం యూఏఈతో తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.