
మహిళలు ధైర్యంగా ఉండండి:
'మనమందరం ఐక్యంగా ఉండాలి. పురుషులు, మహిళలను సమానం గౌరవంతో చూడాలి. గృహహింస కేసులు పెరిగాయన్న నివేదికలను చూశా. ఇవి అమానుష చర్యలు. గృహహింసను నేను ఎప్పుడూ తీవ్రంగా ఖండిస్తా. అన్ని సమయాలలో మహిళలను తమతో సమానంగా పురుషులు గౌరవించాలి. ఎంతో మర్యాదగా ప్రవర్తించాలి. గౌరవం కోసం డిమాండ్ చేయాల్సిన బాధ్యత మహిళలపై ఉంది' అని సానియా మీర్జా పేర్కొంది.

ఏం చేసినా సరిపోదు:
లాక్డౌన్ గురించి కూడా సానియా మాట్లాడింది. 'ప్రస్తుతం కొందరు అత్యవసర పరిస్థితిలో ఉన్నారు. సరైన ఆహరం లేక కష్టాలు పడుతున్నారు. మేము రూ.2.5కోట్ల నిధులను సమీకరించి లక్షల మందికి ఆహారం అందించాం. ఇంకా ఎక్కువ మందికి నేరుగా సాయం చేయాలని అనుకుంటున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసినా సరిపోదు' అని సానియా చెప్పింది. నేను చేసే ప్రతి పని గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదని పేర్కొంది. విరాళం ఇవ్వడం ఒక బాధ్యత అని, ఎక్కువ మందికి సహాయం చేయాలన్నదే నా కోరిక అని సానియా చెప్పుకొచ్చింది.

ఖాళీ స్టేడియంలో ఆడుతా:
అవసరమైతే ఖాళీ స్టేడియంలో ఆడేందుకైనా తాను సిద్ధమని అంటోంది సానియా మీర్జా. కరోనా నెమ్మదించినా ఆటల పోటీలకు అభిమానులను అనుమతించే పరిస్థితి ఇప్పుడిప్పుడే ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. 'అభిమానుల కేరింతల నడుమ కోర్టులో అడుగుపెడుతుంటే ఆ అనుభూతే వేరు. దాన్ని మరేదీ భర్తీ చేయలేదు. అభిమానులు లేకుండా ఆడలేమని అంటే ప్రత్యామ్నాయం ఏంటి? టెన్నిస్ సహా మరే క్రీడ ఆడే అవకాశం ఉండదు. అయితే అది సరైన పరిష్కారం కాదన్నది నా అభిప్రాయం. ఖాళీ స్టేడియంలో ఆడటం వ్యక్తిగతంగా నాకెలాంటి సమస్య కాబోదు. నా దృష్టిలో ప్రయాణం.. టోర్నీకి చేరుకోవడమే పెద్ద సమస్య. రెండు వారాల ముందే అక్కడికి వెళ్లడమంటే సులువైన విషయం కాదు. ఏదేమైనా ఖాళీ స్టేడియంలో ఆడేందుకు నేను సిద్ధం' అని తెలిపింది.

టెన్నిస్ ఆడేందుకు ఏం చేయడానికైనా సిద్ధమే:
'టెన్నిస్‌లో పునరాగమనం కోసం రెండేళ్లు కష్టపడ్డా. బిడ్డకు జన్మనిచ్చి అన్ని అవాంతరాలు అధిగమించాను. ఇప్పుడు అర్ధంతరంగా ఆగిపోయా. మళ్లీ టెన్నిస్ ఆడేందుకు ఏం చేయడానికైనా సిద్ధమే. నిజానికి 2020 టోక్యో ఒలింపిక్స్ ఆడాలన్న ఉద్దేశంతోనే పునరాగమనం చేశా. ఒలింపిక్స్ వాయిదా పడటం నాకు ప్రతికూలమే. వచ్చే ఏడాదికి నా వయసు ఒక సంవత్సరం పెరగడం కలిసొచ్చే అంశం కాదు. అయితే ఒలింపిక్స్‌కు ఇంకో ఏడాది సమయముంది. మునుపటిలా ఆడతాననే అనుకుంటున్నా' అని 33 ఏళ్ల సానియా చెప్పింది.


Click it and Unblock the Notifications












