హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో మహిళా క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళా బౌలర్ డేన్ వాన్ నీకెర్క్ ప్రపంచ రికార్డుని నెలకొల్పింది.
వాన్ నీకెర్క్ (3.2-3-0-4) ప్రపంచ రికార్డు బౌలింగ్‌తో విండీస్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో విండీస్ పది వికెట్లతో ఘోర పరాజయం పాలైంది.
టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 25.2 ఓవర్లలో 48 పరుగులకే ఆలౌటైంది. నీకెర్క్ ఒక్కటంటే ఒక్క పరుగుకూడా ఇవ్వ కుండా నాలుగు వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
మహిళలు, పురుషుల క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ నీకెర్క్ అరుదైన గుర్తింపు పొందింది. 3.2 ఓవర్లు వేసి నీకెర్క్ 4 వికెట్లు తీసింది. ఇందులో మూడు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం.
అనంతరం 49 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 6.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. వరల్డ్ కప్ టోర్నీల్లో దక్షిణాఫ్రికా చేతిలో వెస్టిండిస్ ఓటమి పాలవ్వడం ఇది మూడోసారి. ప్రపంచ రికార్డుని నెలకొల్పిన వాన్ నీకెర్క్‌కు పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు.