ఏక్తా బిస్త్ విజృంభణ: పాక్ అతలాకుతలం, 74కే ఆలౌట్
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత మహిళల జైత్రయాత్ర కొనసాగుతోంది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించి టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 95 పరుగుల తేడాతో మిథాలీ సేన ఘన విజయం సాధించింది.
స్వల్ప స్కోరును కాపాడుకునే ప్రయత్నంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏక్తా బిస్త్ (10-2-18-5) అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (72 బంతుల్లో 47; 5 ఫోర్లు), సుష్మ వర్మ (35 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 38.1 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. పాక్ కెప్టెన్ సనా మీర్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆ తర్వాత నహీదా ఖాన్ (23) కాస్త ఫరవాలేదని అనిపించింది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి పాకిస్థాన్ పతనాన్ని శాసించింది.
ఏక్తా బిస్త్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. తాజా విజయంతో భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. బుధవారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో శ్రీలంకను ఎదుర్కోనుంది. ఇప్పటివరకు పాక్‌తో మొత్తం పది వన్డేలు ఆడితే పది మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. ప్రపంచకప్‌లో ఇది వరుసగా మూడో గెలుపు కావడం విశేషం.

ఆదిలోనే భారత్‌కు ఎదురుదెబ్బ
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. ఇటీవలే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మందాన (2) నాలుగో ఓవర్లోనే అవుటై నిరాశ పరిచింది. తర్వాత దీప్తి శర్మ, పూనమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించింది. పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరిస్తుండటంతో పరుగుల వేగం మందగించింది. రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించాక జట్టు స్కోరు 74 పరుగుల వద్ద పూనమ్ రౌత్ అవుటైంది.

రన్‌రేట్ దారుణంగా పడిపోయింది
ఈ ఇద్దరూ ఎక్కువ బంతులు తీసుకోవడంతో రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. ఈ సమయంలో నష్ర సంధుకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. తర్వాత స్వల్ప వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడింది. మిథాలీ రాజ్ (8), దీప్తి శర్మ (63 బంతుల్లో 28; 2 ఫోర్లు)లను నష్ర సంధు అవుట్ చేయగా... హర్మన్‌ప్రీత్ కౌర్ (10), మోనా మేశ్రమ్ (6) ఇద్దరు సాదియా యూసుఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు.

111 పరుగులకే 6 వికెట్లు
దీంతో భారత్ 111 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కీపర్ సుష్మ వర్మ, జులన్ గోస్వామితో కలిసి (36 బంతుల్లో 14) కాసేపు పోరాడింది. చివరి 6 ఓవర్లలో సుష్మ దూకుడుగా ఆడడంతో 41 పరుగులు వచ్చాయి. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

అదరగొట్టిన ఏక్తా బిస్త్
జోరు మీదున్న భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న పాకిస్తాన్ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆ జట్టు ఏ దశలోనూ లక్ష్యానికి దగ్గరగా రాలేకపోయింది. తనకు కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చిన కెప్టెన్ మిథాలీ నమ్మకాన్ని ఏక్తా బిస్త్ వమ్ము చేయలేదు. రెండో ఓవర్ నుంచే స్పిన్నర్ ఏక్తా బిస్త్ తన మాయాజాలాన్ని చూపించింది.

రెండో ఓవర్లోనే ఓపెనర్ ఆయేషా అవుట్
ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ ఆయేషా (1)ను ఎల్బీగా అవుట్ చేసి పాక్ పతనానికి నాంది పలికింది. ఐదో ఓవర్లో జవేరియా (6)ను సీమర్ జులన్ గోస్వామి అవుట్ చేయగా.. తర్వాత వరుస ఓవర్లలో సిద్రా నవాజ్ (0)లను పెవిలియన్ పంపింది. ఈ మూడు వికెట్లు ఎల్బీడబ్ల్యూ రూపంలోనే వచ్చాయి. జవేరియా (6) జులన్ గోస్వామి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది.

26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాక్
ఇక, నిలకడగా ఆడుతున్న నహీదాకు కాసేపు సహకారం అందించిన అబిది (5)ని 14వ ఓవర్లో దీప్తి శర్మ అద్భుత బంతితో బౌల్డ్ చేయగా.. తర్వాతి ఓవర్లోనే అస్మావియా (0)ను మాన్సి జోషి పెవి లియన్ చేర్చింది. దీంతో చూస్తుండగానే పాక్ స్కోరు 26/6కు చేరింది.

వరుస వికెట్లతో అతలాకుతలం
ఓపెనర్ నాహిదా ఖాన్ (23), కెప్టెన్ సనా మీర్ (29) ఆదుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అయితే, 24వ ఓవర్లో నహీదాను అవుట్ చేసిన హర్మన్‌ప్రీత్ ఈ జోడీని విడదీసింది. ఆ వెంటనే మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన ఏక్తా బిస్త్ వరుస బంతుల్లో నష్రా సంధు (1), డయానా (0)లను పెవిలియన్‌కు పంపింది. దీంతో బిస్త్ ఖాతాంలో ఐదు వికెట్లు చేరాయి. ఒంటరి పోరాటం చేస్తున్న కెప్టెన్ సనామిర్‌ను 39వ ఓవర్లో జోషి బౌల్డ్ చేయడంతో 38.1 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications