హైదరాబాద్: భారత మహిళా క్రికెటర్లు బుధవారం ఉదయం ముంబైకి చేరుకుంది. బుధవారం తెల్లవారుజామున ఇంగ్లాండ్ నుంచి ముంబైకి చేరుకున్న జట్టుకు బీసీసీఐ సిబ్బంది, అభిమానులు స్వాగతం పలికారు. ఆదివారం లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
మిథాలీ సేన ఓటమిపాలైనా తమ అద్భుతమైన పోరాటపటిమతో కోట్లాది భారతీయుల మనసులను గెలుచుకుంది. ప్రధాని మోడీ దగ్గర నుంచి ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా మిథాలీ సేనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకున్న భారత మహిళల జట్టులో కొందరు క్రికెటర్లు, సిబ్బంది బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో స్వదేశానికి చేరుకున్నారు.

కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, ఝలన్ గోస్వామితో పాటు పలువురు క్రికెటర్లకు ముంబయిలోని ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని క్రికెటర్లకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక బస్సులో మహిళా క్రికెటర్లు అక్కడ నుంచి వెళ్లారు.
ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ 'స్వదేశంలో ఇంతటి ఘనస్వాగతం దక్కుతోందని ఊహించలేదు. ప్రస్తుతం క్రీడల్లో అమ్మాయిలు అద్భుతంగా రాణిస్తారు. గతంలో మహిళా క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వారు కాదు. వరల్డ్ కప్‌లో మా ప్రదర్శనతో ఇప్పుడు అందరూ మా గురించే మాట్లాడుకుంటున్నారు. సంతోషంగా ఉంది' అని పేర్కొంది.
వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన మిథాలీ సేనను ఘనంగా సన్మానించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సన్మాన కార్యక్రమానికి సంబంధించి వేదికతో పాటు తేదీని బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. ప్లేయర్లు అందుబాటుని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ త్వరలో ఈ సన్మాన కార్యక్రమంపై ఓ నిర్ణయం తీసుకోనుంది.