హైదరాబాద్: భారత మహిళా జట్టు కెప్టన్ మిథాలీ రాజ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. వరల్డ్ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ అరుదైన ఘనతన సాధించింది. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో వరుసగా మిథాలీ రాజ్ ఏడో అర్ధ సెంచరీని నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో మిథాలీ 84 బంతుల్లో 71 పరుగులు చేసింది. ఆమెతోపాటు స్మృతి మంధన (90), పూనమ్ రౌత్ (86)లు కూడా అర్ధ సెంచరీలతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు మిథాలీ రాజ్ వరుసగా ఆరు అర్ధ సెంచరీలు చేసింది.

దక్షిణాఫ్రికాపై 62, 54, 51, బంగ్లాదేశ్‌పై 73, దక్షిణాఫ్రికాపై 64, శ్రీలంకపై 70 పరుగులు చేసింది. గతంలో వరుసగా ఆరు అర్ధ సెంచరీలు చేసిన లిండ్సే రీలర్, చార్లెట్ ఎడ్వర్డ్స్, ఎలిస్ పెర్రీల రికార్డును మిథాలీ బద్దలు కొట్టింది. ఇది మిథాలీకి తన కెరీర్‌లో 47వ అర్ధ సెంచరీ. దీంతో పాటు ఉమెన్స్ క్రికెట్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన క్రీడాకారిణి రికార్డు కూడా మిథాలీ పేరిట ఉంది.
1999లో అంతర్జాతీయ క్రికెట్ అడుగు పెట్టిన మిథాలీ.. ఈ 18 ఏళ్లలో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో ఐదు వేలకుపైగా పరుగులు సాధించిన రెండో మహిళా క్రికెటర్‌గా మిథాలీ నిలిచింది. మరో 148 పరుగులు చేస్తే వన్డేల్లో ఆరు వేల పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రికార్డు సృష్టిస్తుంది.