హైదరాబాద్: ఉమెన్ వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ మొదలైనప్పటి నుంచి ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్న మిథాలీ సేన వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుని సెమీస్‌కు మరింత చేరువైంది. శ్రీలంకతో బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 16 పరుగుల తేడాతో గెలుపొందింది.
భారత్ నిర్దేశించిన 233 పరుగుల లక్ష్య చేదనకు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు మాత్రమే చేసింది. దిలాని సురంగిక (61), సరివర్దనె (37), హన్సిక (29) పోరాడినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (2/23), జులన్ గోస్వామి (2/26) రెండేసి వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, ఏక్తా బిస్త్ చెరో వికెట్ దక్కించు కున్నారు.

అంతకుముందు భారత్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 232 పరుగులు చేసింది. దీప్తి శర్మ (78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53) అర్ధ సెంచరీలతో రాణించారు. ఈ విజయంతో భారత్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. శనివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో మిథాలీ సేన దక్షిణాఫ్రికాను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే సెమీస్‌కు చేరినట్లే.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు స్మృతి మంధాన (8), పూనమ్ రౌత్ (16) వెంటవెంటనే అవుటవడంతో 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో దీప్తి శర్మ, మిథాలీ రాజ్ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును పరిగెత్తించారు.
ఆరంభంలో మిథాలీ వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చినా దీప్తి మాత్రం వీలు చిక్కినపుడల్లా ఫోర్లు బాదుతూ రన్‌రేట్ పడిపోకుండా చూసింది. క్రీజులో కుదురుకున్నాక మిథాలీ కూడా భారీ షాట్లు ఆడడంతో భారత్ కోలుకుంది. ఈ క్రమంలో దీప్తి 89 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె మరింత వేగం పెంచింది.

అయితే.. సెంచరీవైపు దూసుకెళ్తున్న దీప్తిని కాంచన పెవిలియన్‌కు చేర్చింది. ఆ తర్వాత కాసేపటికే వరుస బంతుల్లో జులన్ గోస్వామి (9), మిథాలీని అవుట్ చేసిన లంక కెప్టెన్ ఇనోక రణవీర భారత్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో ఓ దశలో 156/2తో పటిష్ఠ స్థితిలో ఉన్న మిథాలీ సేన స్వల్ప తేడాతో మూడు వికెట్లు కోల్పోయి 169/5తో కష్టాల్లో పడింది. ఈ సమయంలో హర్మన్‌ప్రీత్ (20), వేద కృష్ణమూర్తి (29) ఆరో వికెట్‌కు విలువైన 50 పరుగులు జోడించడంతో భారత్ 200 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే హాసిని పెరీరా (10)ని గోస్వామి అవుట్ చేసింది. అయితే మరో ఓపెనర్ హన్సిక (29)కు జతకలిసిన చమరి ఆటపట్టు జయంగని (25) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో వీరి జోడిని పూనమ్ యాదవ్ విడదీసింది.
18వ ఓవర్లో ఆటపట్టుని అవుట్ చేసిన పూనమ్ కొద్దిసేటికే హన్సికను కూడా పెవిలియన్ చేర్చింది. అప్పటికి లంక స్కోరు 70/3. ఈ దశలో సిరివర్దనె, సురంగిక నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే భారత అవకాశాలపై అనుమానాలు రేకెత్తుతున్న దశలో గోస్వామి రంగంలోకి దిగింది.

39వ ఓవర్ ఆఖరి బంతికి ప్రమాదకర సిరివర్దనెను పెవిలియన్‌కు చేర్చింది. ఆ తర్వాత కాంచన (7) కూడా రనౌటవడంతో శ్రీలంక కష్టాల్లో పడింది. ఈ దశలో సురంగిక అర్ధ సెంచరీతో ఒంటరిపోరాటం చేసింది. అయితే జట్టు విజయానికి మరో 18 బంతుల్లో 42 పరుగులు కావాల్సిన దశలో ఆమె అవుట్ కావడంతో లంక ఓటమి పాలైంది.
మార్పులు లేకుండా బరిలోకి లంక
ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా బుధవారం ఇండియా, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ భారత్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకోగా శ్రీలంక ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.
ఇక భారత్ జట్టులోకి మోన శర్మ స్థానంలో వేదా శర్మను తీసుకున్నారు. పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుందనే బ్యాటింగ్ తీసుకున్నామని 250 పరుగుల చేస్తే స్పిన్నర్లతో మ్యాచ్ గెలువచ్చని మిథాలీ ధీమా వ్యక్తం చేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మంచి ఊపు మీదుంది.

శ్రీలంకతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మిథాలీ సేన విజయం సాధిస్తే నేరుగా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఓపెనర్ స్మృతి మందాన ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. గత మ్యాచ్‌లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇక శ్రీలంక విషయానికి వస్తే ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. భారత్ ప్రస్తుతం ఆరు పాయింట్లతో టాపర్‌గా ఉంది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో విశేషంగా రాణిస్తున్న భారత అమ్మాయిలు ఫేవరెట్‌గానే కనిపిస్తుండగా... అన్నింట్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న లంక ఏమేరకు పోటీనివ్వగలదో వేచి చూడాలి.
జట్ల వివరాలు:
ఇండియా: Poonam Raut, Smriti Mandhana, Dipti Sharma, Mithali Raj (captain), Harmanpreet Kaur, Veda Krishnamurthy, Sushma Verma (wicketkeeper), Jhulan Goswami, Mansi Joshi, Ekta Bisht, Poonam Yadav.
శ్రీలంక: Hasini Perera, Nipuni Hansika, Chamari Athapaththu, Shashikala Siriwardena, Dilani Manodara (wicketkeeper), Prasadani Weerakkodi, Oshadi Ranasinghe, Ama Kanchana, Sripali Weerakkody, Inoka Ranaweera (captain), Chandima Gunaratne.