వరల్డ్ కప్ ఫైనల్‌లోనూ భార్య సునామీ సెంచరీ..మిఛెల్ స్టార్క్ ఆనందానికి హద్దుల్లేవ్ మరి: 350+

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చెలరేగిపోతోంది. ఆకాశమే హద్దుగా ఆడుతోంది. రికార్డులు బద్దలవుతున్నాయి. ఎవరూ అందుకోలేని కొత్త రికార్డులు రెడీ అవుతున్నాయి. ఆసీస్ విమెన్ ప్లేయర్లు ఇంగ్లాండ్ బౌలర్ల దుమ్ము దులుపుతున్నారు. ఊహించలేని, సాధించలేని లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది. చివరి ఓవర్లల్లో బౌండరీల వర్షాన్ని కురిపిస్తోన్నారు ఆసీస్ విమెన్ ప్లేయర్లు.

బ్యాక్ అండ్ బ్యాక్ సెంచరీలు..
ఈ క్రమంలో ఓపెనర్ అలీస్సా హీలీ సెంచరీని బాది అవతల పడేసింది. 100 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసింది హీలీ. ఈ టోర్నమెంట్‌లో ఆమె ట్రిపుల్ డిజిట్ ఫిగర్‌ను అందుకోవడం వరుసగా ఇది రెండోసారి. సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆమె సెంచరీ సాధించింది. వెస్టిండీస్‌పై జరిగిన సెమీ ఫైనల్‌లో హీలీ 129 పరుగులు చేసింది. దీనికోసం ఆమె తీసుకున్న బంతులు 107. ఇప్పుడు తన రికార్డ్ స్కోరును తానే బద్దలు కొట్టిందామె. సరికొత్తగా తిరగరాసుకుంది.

38 బంతుల్లో 70
ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై సెంచరీ బాదేసింది. పట్టపగ్గాల్లేకుండా దూసుకెళ్లింది. 138 బంతుల్లో 170 పరుగులు చేసింది. 45 ఓవర్‌లో వెనుదిరిగింది. ష్రుబ్‌సోల్ వేసిన ఆ ఓవర్ మూడో బంతికి స్టంపౌట్ అయింది. 100 బంతుల్లో 100 పరుగులు చేసిన హీలీ- ఆ తరువాత 38 బంతుల్లోనే 70 రన్స్ కొట్టిందంటే- ఆమె ఇన్నింగ్ ఎంత వేగంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఇన్నింగ్‌లో 26 ఫోర్లు నమోదయ్యాయి. చివరి ఓవర్లల్లో వరుస ఫోర్లతో విరుచుకుని పడింది. వన్‌డౌన్ బ్యాటర్ మూనీతో కలిసి 43, 44 ఓవర్లల్లో 37 పరుగులను పిండుకుందామె.

టాప్ ఆర్డర్ ఫుల్ జోష్..
టాస్ ఓడిన ఇంగ్లాండ్ విమెన్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఏ దశలో కూడా ఆసీస్ ప్లేయర్లను అడ్డుకోలేకపోయింది. తొలి వికెట్ భాగస్వామ్యానికి 160 పరుగులు జత అయ్యాయి. మరో ఓపెనర్ రాఛెల్ హేన్స్ 68 పరుగులు చేసి, అవుట్ అయింది. ఆమె స్థానంలో వన్‌డౌన్‌గా వచ్చిన బెత్ మూనీ సైతం హాఫ్ సెంచరీని అందుకుంది. ఇంగ్లాండ్ విమెన్స్ టీమ్ ఛేదించలేనంత లక్ష్యాన్ని ఆసీస్ సాధించడం ఖాయమైంది.

మిఛెల్ స్టార్క్ భార్య..
ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా హీలీ చరిత్రకెక్కింది. తొమ్మిది ఇన్నింగ్స్‌లల్లో 509 పరుగులు చేసిందామె. ఇందులో రెండు బ్యాక్ అండ్ బ్యాక్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ యావరేజ్ 56.56. అలిస్సా హీలీ సెంచరీ పట్ల ఆమె భర్త, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. స్టాండ్స్‌లో ఉంటూ మ్యాచ్‌ను తిలకించాడతను. హీలీ కొట్టి ప్రతి షాట్‌కూ చిన్నపిల్లాడిలా గంతులేశాడు. చప్పట్లు కొడుతూ ప్రోత్సహించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications