
సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన తొలి సెమీఫైనల్ వర్షం కారణంగా ఆలస్యం కానుంది. మ్యాచ్‌కు ముందుగానే సిడ్నీ క్రికెట్ మైదానంలో భారీ వర్షం కురుస్తుండడంతో.. టాస్‌కు అంతరాయం ఏర్పడింది. అంపర్లు టాస్ కోసం కట్-ఆఫ్ సమయంను 11:06గా నిర్ణయించారు. ఆ సమయానికి టాస్ పడితే 11:21 లకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ప్రస్తుతం సిడ్నీ నగరంలో భారీ వర్షం కురుస్తుందని సమాచారం. త్వరగా వర్షం ఆగిపోతే మ్యాచ్‌ను నిర్వహించడానికి మైదాన సిబ్బంది ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వర్షం ఇలాగే కొనసాగి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపొతే.. హర్మన్‌ప్రీత్ సేన నేరుగా ఫైనల్ చేరుతుంది. వర్షంను చూసి ఇప్పటికే ఇంగ్లండ్ క్రీడాకారిణులు, కోచింగ్ సిబ్బంది, అభిమానుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మరి వరణుడు ఏం చేస్తాడో చూడాలి.
ఇదే వేదికపై మధ్యాహ్నం 1.30 గంటలకు జరగాల్సిన రెండో సెమీస్ (దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా) కూడా రద్దు అయితే దక్షిణాఫ్రికా ఫైనల్ చేరనుంది. వర్షంతో రెండు ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లు రద్దయితే తొలిసారి భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్ చేరుకుంటాయి. వర్షం అడ్డంకిగా మారితే.. ఆదివారం భారత్‌తో దక్షిణాఫ్రికా ఫైనల్లో తలపడుతుంది.
వర్షం ముప్పు నేపథ్యంలో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకి 'రిజర్వ్ డే' ఉండాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కోరింది. కానీ.. ఐసీసీ మాత్రం సీఏ అభ్యర్థనని తిరస్కరించింది. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. దీంతో సీఏతో పాటు ఆస్ట్రేలియా జట్టుకు కూడా భారీ షాక్ తగిలింది.