
హైదరాబాద్: మరొ కొద్ది రోజుల్లో మొదలుకాబోతున్న భారత్-ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా టోర్నీ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ టోర్నీకి భారత్ వేదిక కానున్న సంగతి తెలిసిందే. ఈ ముక్కోణపు టోర్నీకి మిథాలీ రాజ్ నాయకత్వం వహించనున్నారు.
ఫిబ్రవరిలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. దీంతో పలువురు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి మహిళల మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న యోచనలో ఉంది బీసీసీఐ. అందుకే ఈ మార్పులు. 2018 ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్లకు అంటే 2013 మార్చి 31 వరకు ప్రసార హక్కుల కోసం ఇప్పటికే బీసీసీఐ టెండర్లు పిలిచింది.
షెడ్యూల్ ప్రకారం మార్చి 22 నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్ - ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ జరగాల్సి ఉంది. ఐతే ఈ నెల 31తో మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్‌తో బీసీసీఐ ఒప్పందం ముగియనుంది. దీంతో ఈ ముక్కోణపు టోర్నీని కాస్త ముందుకు జరపాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ సిరీస్ కంటే ముందు భారత్-ఆస్ట్రేలియా మధ్య మార్చి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ముక్కోణపు సిరీస్ అనంతరం భారత్-ఇంగ్లాండ్ మధ్య సిరీస్ జరగనుంది. ఇప్పుడు ఏ సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేస్తారో తెలియాలంటే మాత్రం వేచి ఉండాల్సిందే.