
మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే దిశగా మరో అడుగు పడింది. ఇప్పటికే ఐపీఎల్ వంటి టోర్నీలో అడుగుపెట్టగా.. తాజాగా ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. బర్మింగ్‌హామ్ వేదికగా 2022లో జరిగే ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్ భాగం కాబోతుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
గురువారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో క్రికెట్‌కు ఆమోద ముద్ర వేశారు. గత నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా సమర్పించిన బిడ్‌ను పరిశీలించి సీజీఎఫ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో 1998 (కౌలాలంపూర్) తర్వాత తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు చోటు దక్కింది.
'మహిళల క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బర్మింగ్‌హామ్ కామన్వెల్త్‌లో అవకాశమిచ్చాం. బాలికలు, మహిళల సాధికారికత.. క్రికెట్‌ను మరింత అభివృద్ధి పరుచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం' అని సీజీఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. 'ఇది మహిళా క్రికెట్ అభివృద్ధి కావడానికి, మహిళా సాధికారత సాధనకు లభించిన గొప్ప అవకాశం' అని ఐసీసీ ట్వీట్ చేసింది. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌కు చోటు దక్కింది. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. తర్వాత మరెప్పుడూ కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ భాగం కాలేదు.